కేరళ డీజీపీగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దర్వేష్ సాహెబ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే.. ఆయన సొంత ఊరు బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల. బెస్తవీధిలో నివాసం ఉండేవారు. దర్వేష్ తండ్రి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. దర్వేష్ సాహెబ్ ప్రాథమిక విద్య పోరుమామిళ్లలోనే పూర్తి చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రయివేట్ స్కూలు, ఆ తర్వాత ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్‌లో చదివారు. డిగ్రీ, పీజి తిరుపతిలో చదివారు దర్వేష్ సాహెబ్. దర్వేష్ రెండురోజుల కిందట కేరళ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దీంతో.. ప్రజలు, ఆయన సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఐఏఎస్ సాధించాలని దర్వేష్ సాహెబ్ ఎంతో కష్టపడ్డారు. మొదటిసారి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఎంపికయ్యారు. ఆ పోస్టుని వదులుకుని మరోసారి ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యారు. రెండో సారి ఐపీఎస్‌గా సెలక్ట్ అయ్యారు దర్వేష్. 1990 బ్యాచ్ కేరళ కేడర్‌లో ఉద్యోగంలో చేరారు. జిల్లా ఎస్పీ నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ డీజీపీగా నియమితులయ్యారు. కాగా.. దర్వేష్ సాహెబ్ వచ్చే ఏడాది జూలై వరకు డీజీపీ పదవిలో కొనసాగనున్నారు.