సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు బయల్దేరిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2023 9:23 AM GMT
Intercity express,  Smoke, Secunderabad-Guntur,

సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ముందుగా గుర్తించడంతో.. పెను ప్రమాదాలు తప్పుతుంటే.. కొన్నిసార్లు మాత్రం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దాంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న ఘటనల దృష్ట్యా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించాలంటే కాస్త వెనకడుగు వేసే పరిస్థితులు నెలకొంటున్నాయి.

సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు బయల్దేరిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అయితే.. పొగలు పెద్ద ఎత్తున రావడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ పొగలను గుర్తించారు రైల్వే అధికారులు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ వద్దకు చేరుకోగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. దాంతో.. రైల్వే సిబ్బంది అప్రమత్తమై స్టేషన్‌ ఘన్పూర్‌లోనే రైలును దాదాపు 10 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ తర్వాత ఏం జరిగిందా అని పూర్తిగా పరిశీలించారు. బ్రేక్‌ లైనర్లలో పొగలు వచ్చాయని.. ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించారు. అంతా సరి చేసిన తర్వాత రైలు యథావిధిగా గుంటూరుకు వెళ్లింది.

ఇటీవల ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కొన్ని బోగీలు ఆ ఘటనలో దగ్ధం అయ్యాయి. ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో.. తాజాగా మరోసారి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించడం ఆందోళనకు గురి చేసింది. చివరకు ఎలాంటి ప్రమాదం జరగదని.. అంతా చెక్‌చేశామని రైల్వే అధికారులు వివరణ ఇచ్చాక ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. కొందరు మాత్రం ఇలాంటివి ఘటనలు జరగకుండా ముందే అధికారులు అలర్ట్‌గా ఉండాలని.. వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అన్ని పరిశీలించాకే ట్రైన్‌ను కదిలించాలని చెబుతున్నారు. లేదంటే రైల్వేస్‌పై ప్రజలకు నమ్మకం పోతుందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story