భారతీయ సంపన్నుల్లో అంబానీ టాప్..లిస్ట్‌లో 105 మంది తెలుగువారు

దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్‌ వెల్త్‌ అండ్ హురూన్‌ ఇండియా విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on  11 Oct 2023 11:32 AM IST
indias richest persons, mukesh ambani, adani, telugu states,

భారతీయ సంపన్నుల్లో అంబానీ టాప్..లిస్ట్‌లో 105 మంది తెలుగువారు

దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్‌ వెల్త్‌ అండ్ హురూన్‌ ఇండియా విడుదల చేసింది. దేశంలో అపర కుబేరుల జాబితాలో తొలిస్థానంలో ముకేశ్ అంబానీ నిలిచారు. అంబానీ వ్యక్తిగత సంపద విలువ రూ.8.08 లక్షల కోట్లుగా ఉన్నట్లు తేలింది. ఇక అంబానీ తరువాతి స్థానంలో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ నిలిచారు. కాగా.. సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది చోటు సంపాదించుకున్నారు.

అయితే.. గతేడాది భారతీయ అత్యధిక సంపన్నుల లిస్ట్‌లో టాప్‌లో నిలిచిన అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ ఆదానీ రెండో స్థానానికి చేరుకున్నారు. ఆగస్టు చివరి నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా భారత్‌లోని 138 నగరాల నుంచి మొత్తం 1,319 మంది హురూన్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది సంపన్నులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. కాగా.. మొత్తం అందరి సంపద విలువ ఏకంగా రూ.5.25 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద ఏకంగా 33 శాతం పెరిగిందని తెలుస్తోంది. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్‌కు చెందినవారే. ఇక కొత్తగా సంపన్నుల్లో 33 మంది చోటు సంపాదించుకున్నారు. వీరి ద్వారా మొత్తం రూ.76వేల కోట్లు జమైనట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారని హురూన్‌ ఇండియా విడుదల చేసిన జాబితా ద్వారా తెలుస్తోంది.

దివి లేబోరేటరీస్‌‌కు చెందిన మురళి దివి కుటుంబం రూ.55,700 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో నెం.1గా నిలిచింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన పి.పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్ల సంపదతో 37 స్థానంలో ఉన్నారు. రూ. 35,800 కోట్ల సంపదతో పీవీ కృష్ణా రెడ్డి 41 స్థానంలో నిలిచారు. ఇక హెటిరో ల్యాబ్స్‌కు చెందిన బి.పార్థసారథి రెడ్డి కుటుంబం రూ.21,000 కోట్లతో 93వ స్థానం దక్కించుకుంది. అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రతాప్ సీ రెడ్డి రూ. 20,900 కోట్ల వ్యక్తిగత సంపదతో 99వ స్థానంలో నిలిచారు. మైహోం ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు సంపద రూ.17,500 కోట్లుతో తరువాత స్థానాల్లో నిలిచారు. మహిళల్లో మహిమా దాట్ల రూ.5700 కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచారు.

Next Story