అమెరికాలో జాహ్నవి మృతిపై భారత్ స్పందన, దర్యాప్తునకు డిమాండ్

జాహ్నవి మృతిపై తాజాగా భారత్‌ స్పందించింది. అధికారి బాడీ క్యామ్‌ ఫుటేజీపై సమగ్ర దర్యాప్తు చేయాలని అమెరికాను కోరింది.

By Srikanth Gundamalla  Published on  14 Sep 2023 6:08 AM GMT
Indian Student, death,  US, Police, viral,

 అమెరికాలో జాహ్నవి మృతిపై భారత్ స్పందన, దర్యాప్తునకు డిమాండ్

అమెరికాలో భారత్‌కు చెందిన విద్యార్థిని కందుల జాహ్నవి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే.. పోలీసు అధికారి కారు ఢీకొనడంతోనే జాహ్నవి చనిపోయింది. ఈ ఘటనపై సుదురు అధికారి సరదాగా జోకులు వేస్తూ భారతీయ విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదురు అధికారి వ్యాఖ్యలపై ఇప్పటికే నిరసనలు, విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. జాహ్నవి మృతిపై తాజాగా భారత్‌ స్పందించింది. అధికారి బాడీ క్యామ్‌ ఫుటేజీపై సమగ్ర దర్యాప్తు చేయాలని అమెరికాను కోరింది.

కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి(23) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. ఉన్నత చదువుల నిమిత్తం 2021లో అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23న కళాశాలకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత విద్యార్థిని చనిపోవడం పట్ల పోలీసుల అధికారి నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఆమె చనిపోయింది, ఆమె చాలా మాములు మనిషి, 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ " అంటూ వెకిలిగా నవ్వుతు సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ అడెరర్ మాట్లాడాడు. న పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియోపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలపై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది.

కందుల జాహ్నవి మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు దిగ్భ్రాంతికి గురి చేశాయని దౌత్యకార్యాలయం తెలిపింది. సియాటిల్‌ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు దౌత్యకార్యాలయం వెల్లడించింది.

Next Story