కెనాడలో భారతీయ విద్యార్థి తుపాకీ కాల్పులకు బలి

కెనడాలో భారతీయ విద్యార్థి తుపాకీ గుళ్లకు బలయ్యాడు.

By Srikanth Gundamalla  Published on  14 April 2024 12:00 PM GMT
indian student, death,  canada, gun fire ,

కెనాడలో భారతీయ విద్యార్థి తుపాకీ కాల్పులకు బలి

విదేశాల్లో చదువుకునేందుకు ఎంతో మంది యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నపట్నుంచి అదే తమ డ్రీమ్‌గా పెట్టుకుని అబ్రాడ్‌కు వెళ్లి చదువుకుంటున్నారు. కొందరు అక్కడే మంచి జాబ్‌ సంపాదించి స్థిరపడిపోతున్నారు. అయితే.. ఇటీవల కాలంలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు హత్యకు గురవుతున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా కెనడాలో భారతీయ విద్యార్థి తుపాకీ గుళ్లకు బలయ్యాడు. చిరాగ్‌ ఆంటిల్ అనే ఇండియన్ స్టూడెంట్ తన కారులోనే శవమై కనిపించాడు.

కెనడాలోని దక్షిణ వాంకోవర్‌లో ఏప్రిల్ 12వ తేదీన ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిరాగ్‌ ఆంటిల్‌ కెనాడలో హత్యకు గురయ్యాడనే విషాన్ని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు విషాద సంద్రంలో మునిగిపోయారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు ప్రారంభించామని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు.

ఏప్రిల్ 12వ తేదీనే చిరాగ్‌తో తాము మాట్లాడామని అతని సోదరుడు రోనిత్ తెలిపాడు. ఫోన్‌లో చనిపోవడానికి ముందే ఎంతో ఉత్సాహంగా మాట్లాడినట్లు చెప్పాడు. అయితే.. అంతలోనే ఇంతటి తీవ్ర విషాదం చోటుచేసుకుంటుందని ఊహించలేదు అని చెప్పాడు. అయితే.. చిరాగ్‌ చాలా మంచి వ్యక్తి అనీ.. ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు అని సోదరుడు వెల్లడించాడు.

ఇక చిరాగ్‌ హత్య సంఘటనపై పలువురు స్పందించారు. చిరాగ్‌ ఆంటిల్ డెడ్‌బాడీని భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వరుణ్ చౌదరి కోరారు. ఈ క్రమంలోనే చిరాగ్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు గో ఫండ్‌ మీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా నిధుల సేకరణ జరుగుతోందని కెనడా మీడియా పేర్కొంది. ఏదీ ఏమైనా విదేశాల్లో చదువు కోసం వెళ్లిన విద్యార్థులు వరుసగా మరణించడం కలవరపాటుకి గురిచేస్తోంది.

Next Story