ISPL: క్రికెట్‌ రంగంలోకి రామ్‌చరణ్‌.. హైదరాబాద్‌ టీమ్‌ కొనుగోలు

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఇతర ఏ ఆటకు ఉండదు.

By Srikanth Gundamalla  Published on  24 Dec 2023 7:15 AM GMT
india cricket, ispl, ram charan, owner,  hyderabad team,

ISPL: క్రికెట్‌ రంగంలోకి రామ్‌చరణ్‌.. హైదరాబాద్‌ టీమ్‌ కొనుగోలు

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఇతర ఏ ఆటకు ఉండదు. టీమిండియా మ్యాచ్‌లు అంటే చాలు అభిమానులు లైవ్‌లో చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తారు. ఇక ఇండియాలో జరిగే ఐపీఎల్‌కు ఉండే క్రేజ్‌ వేరు. ఇండియన్ ‌ప్రీమియర్ లీగ్‌తో పాటు.. ఉమెన్స్‌ ప్రీమియర్ లీగ్‌ కూడా క్రికెట్‌ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది గల్లీ క్రికెటర్ల కోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ప్రారంభః కానుంది. ఈ కొత్త లీగ్‌పై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. గల్లీల్లో ఉండే టాలెంట్‌ను వెతికి మరీ ఇక్కడకు తీసుకొస్తారు. ముఖ్యంగా పలువురు సినీ సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముంబై జట్టును కొనుగోలు చేశారు. ఇక హృతిక్ రోషన్ బెంగళూరు, అక్షయ్ కుమార్ శ్రీనగర్ జట్లను కొన్నారు. తాజాగా వీరి జాబితాలో టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ కూడా చేరిపోయారు. ఈ గ్లోబల్ స్టార్‌ హైదరాబాద్‌ టీమ్‌ను కొనుగోలు చేశారు.

గల్లీ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ టీమ్‌ను కొనుగోలు చేసిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఒక పోస్టు పెట్టారు. 'గల్లీ క్రికెట్‌ లీగ్‌ హైదరాబాద్‌ జట్టుకు యజమాని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఎస్‌పీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు జైత్రయాత్ర కోసం, అందమైన జ్ఞాపకాల్ని పోగు చేసుకునేందుకు నాతో చేతులు కలపండి' అని రామ్‌చరణ్‌ ఎక్స్‌ వేదికగా తన పోస్టులో రాసుకొచ్చారు. భారత్‌లో గల్లీ క్రికెట్ ఆడే టెన్నిస్‌ బాల్‌తో ఈ మ్యాచుల్లో ఉపయోగిస్తారు. 2024 ఏడాది మార్చి నుంచే ఈ లీగ్‌ మొదలు అవుతుంది.

ఐపీఎల్ మాదిరిగానే ఫ్రాంచైజీలు ఈ లీగ్‌లో తమ ఆటగాళ్లను బరిలోకి దింపుతాయి. టీ10 ఫార్మాట్‌లో ఈ లీగ్‌ జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు తలపడతాయి. ఆరు జట్లు ఏడు రోజుల పాటు 19 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ముంబై, మైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, శ్రీనగర్ ఫ్రాంచైజీలు ఈ లీగ్‌లో తలపడనున్నాయి. ఫిబ్రవరి 24న ముంబై వేదికగా ఐఎస్‌పీఎల్ వేలం ఉంటుంది. ఒక్కో జట్టుకు రూ.కోటి పర్స్‌ వాల్యూ ఉంటుంది. ఒక్క ప్లేయర్‌ కొనుగోలుకు అత్యధిక నగదు రూ.3లక్షలు.

Next Story