మరోసారి సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు

భారత్‌ ఉన్న సరిహద్దు దేశాల్లో ఒకటి చైనా. ఈ దేశం నిత్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది.

By Srikanth Gundamalla  Published on  18 Sept 2024 4:41 PM IST
మరోసారి సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు

భారత్‌ ఉన్న సరిహద్దు దేశాల్లో ఒకటి చైనా. ఈ దేశం నిత్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. తాజాగా మరోసారి బరితెగించి ప్రవర్తించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులకు సమీపంలో కొత్త హెలిపోర్ట్‌ను నిర్మించడం ప్రారంభించింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సరిహద్దులకు సైన్యాన్ని వేగంగా తరలించేందుకు ఈ హెలిపోర్ట్‌ నిర్మాణాన్ని చేపట్టిందని తెలిసింది. కాగా.. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ హెలిపోర్ట్‌ ప్రాంతం టిబెట్ భూభాగంలోకి వస్తుంది. భారత్‌కు చెక్ పెట్టేందుకు చైనా నిర్మిస్తోందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. భారత్ చైనా వాస్తవాధీన రేఖకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ హెలిపోర్ట్‌ను చైనా నిర్మిస్తోంది.

చైనా సైనిక కార్యక‌లాపాల‌ను వేగ‌ం చేసేందుకు డ్రాగన్‌కు ఈ హెలిపోర్టు కీలకం అవుతుందని చెబుతున్నారు. గోంగ్రిగాబు క్యూ న‌ది స‌మీపంలో ఈ హెలిపోర్టును మెరుపు వేగంతో చైనా నిర్మిస్తోంది. ఈ ప్రాంతంపై భార‌త్‌తో చైనాకు ఎలాంటి విభేదాలు లేనప్పటికీ.. భారత సరిహద్దుల్లోకి సైన్యాన్ని, ఆయుధాలను వేగంగా తరలించేందుకు కీలకం కానుంది. ఆ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన ఫిష్‌టెయిల్స్ ప్రాంతానికి సమీపంలో ఉంది. శాటిలైట్ ఇమేజరీ ప్రకారం 2023 డిసెంబర్ 1వ తేదీ వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు కనిపించలేదు. కానీ డిసెంబర్ 31వ తేదీన తీసిన ఫోటోల్లో.. హెలిపోర్ట్ నిర్మాణం కోసం అక్కడ పనులు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఇక 2024 సెప్టెంబరు 16వ తేదీన మాక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఫోటోల్లో అత్యాధునిక హెలిపోర్ట్ నిర్మాణం స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న ఆ హెలిపోర్ట్‌లో 600 మీటర్ల రన్‌వే ఉన్నట్లు కనిపించింది. హెలిపోర్టులో 3 హ్యాంగ‌ర్లు ఉన్నాయి. హెలికాప్టర్లను సరైన స్థానంలో ఉంచేందుకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సౌకర్యం, వాటికి అనుబంధ‌మైన నిర్మాణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Next Story