విస్తరిస్తున్న మంకీ పాక్స్ - మరో మహమ్మారిలా మారుతుందా?
By - Nellutla Kavitha | Published on 23 May 2022 2:39 PM GMTతొలి కేసు బయటపడి రెండున్నరేళ్లు అయినప్పటికీ కరోనా భయం ఇప్పటికి కూడా వెన్నాడుతూనే ఉంది. చైనా, నార్త్ కొరియా తో పాటుగా మరికొన్ని దేశాలు కరోనా బారినపడి విలవిల లాడుతున్నాయి. అక్కడక్కడ కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు కూడా చెబుతున్నాయి. దీనికి తోడు తాజాగా మరొక వైరస్ ప్రపంచాన్ని వణికించడానికి సిద్ధమవుతోంది. అదే మంకీ పాక్స్ వైరస్.
ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 80 మంకీ పాక్స్ పాజిటివ్ కేసులుంటే 50 సాంపిల్స్ కు ఫలితం రావాల్సి ఉంది. దీంతోపాటుగానే మెల్లి మెల్లిగా వైరస్ సోకిన దేశాల సంఖ్య కూడా పెరుగుతోంది. అమెరికా, యూరోప్ లో చిన్నగా మొదలైన కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా మహమ్మారి తరవాత మంకీ పాక్స్ మరో మహమ్మారిగా మారుతుందా అనే భయం ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు తెప్పిస్తోంది. ఇప్పటికే అమెరికా, యు.కె, కెనడా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ఇక స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్ లో ఈ కేసులు వెలుగు చూశాయి. గత వారం బెల్జియంలో నాలుగు మంకీ పాక్స్ కేసులు బయటపడటంతో వైరస్ సోకిన వ్యక్తులకు 21 రోజుల క్వారంటైన్ విధించింది బెల్జియం. మంకీ పాక్స్ వైరస్ సోకిన పేషెంట్లకు క్వారంటైన్ విధించిన మొదటి దేశంగా బెల్జియం నిలిచింది.
1958లో ఈ వైరస్ను తొలిసారి కోతుల్లో గుర్తించడంతో దీనికి మంకీ పాక్స్ వైరస్ గా నామకరణం చేశారు. ఆర్తోపాక్స్ వైరస్ కుటుంబానికి చెందిన ఈ వైరస్ మసూచి తరహ పొక్కులను కలిగి ఉంటుంది. మసూచికి కారణం అయ్యే వైరస్ కూడా ఇదే కుటుంబానికి చెందింది. మంకీ పాక్స్ కి గురైన వ్యక్తుల్లో పొక్కుల తో పాటుగా జ్వరం ,చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, లింఫ్ గ్రంధుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 1970 లో ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారి మనుషులకీ సోకింది మంకీ పాక్స్. అయితే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
సాధారణంగా ఆఫ్రికా దేశాల్లో కనిపించే మంకీ పాక్స్ ఇప్పుడు ఆఫ్రికాలో కాకుండా ఇతర 15 దేశాలలో కనిపించడం ఆందోళనకు గురి చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. అయితే ఇంతలా వ్యాప్తి చెందడానికి కారణం మంకీ పాక్స్ వైరస్ లో ఏదైనా వేరియంట్ మార్పులు వచ్చాయా అనే దాని మీద రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందని భావిస్తోంది డబ్ల్యూహెచ్ఓ. మంకీ పాక్స్ వైరస్ ఎలుకలు, ఉడుతల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటుగా వైరస్ సోకిన వ్యక్తి నుంచి కూడా ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. శరీర స్రావాలు, నోటి నుంచి వెలువడే తుంపరల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ వైరస్ సోకిన వ్యక్తి మూడు వారాల పాటు ఐసోల్షన్ లో ఉంటే మంచిదని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది.