హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు సూపర్‌ ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ శోభ మొదలైంది. దాదాపుగా హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లిపోయారు ప్రజలు.

By Srikanth Gundamalla
Published on : 14 Jan 2024 12:32 PM IST

hyderabad metro, offer, super saver, unlimited journey,

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు సూపర్‌ ఆఫర్ 

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ శోభ మొదలైంది. దాదాపుగా హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లిపోయారు ప్రజలు. దాంతో.. నగరం ఇప్పుడు ఖాళీగానే కనిపిస్తోంది. రోడ్లు కూడా రద్దీగా కనింపించడం లేదు. దాంతో.. ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణికులు లేక ఖాళీగానే కనిపిస్తున్నాయి. మూడ్రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేసేందుకు సొంతగ్రామాలకు వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో బంపరాఫర్ ప్రకటించింది.

పండగ సందర్భంగా మెట్రోల్లో ప్రయాణం చేయాలనుకునే వారికి శుభవార్త చెప్పింది మెట్రో యాజమాన్యం. మూడ్రోజుల పాటు మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. సూపర్‌ సేవర్‌ కార్డు ద్వారా రూ.59తో రీచార్జ్‌ చేస్తే మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అపరిమితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ కార్డు హాలీడే సమయాల్లో వర్తిస్తుంది. జనవరి 13, 14, 15 తేదీల్లో మెట్రో సూపర్‌ సేవర్‌ కార్డు ద్వారా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది హైదరాబాద్ మెట్రో.

కాగా.. ఇప్పటికే ఒకరోజు అయిపోగా.. మరో రెండ్రోజులు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చు. రూ.59తో రీచార్జ్‌ చేసుకుని అపరిమితంగా ఈ రెండ్రోజులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేయవచ్చు. ఆదివారం, సోమవారం ప్రత్యేకంగా హాలీడే ఇచ్చారు. రెండ్రోజుల పాటు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో తెలిపింది. ఆలస్యం చేయకుండా ఇక సొంత వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ ఖర్చు పెట్టే బదులు తక్కువ ఖర్చుతో అపరిమితంగా మెట్రోల్లో తిరిగేయండి.

కాగా.. మెట్రో స్టేషన్లలో టికెట్‌ కౌంటర్ల వద్ద ఈ కార్డు తీసుకోవచ్చు. కొత్తగా కార్డు తీసుకునేవారు రూ.109 చెల్లించి కార్డు తీసుకోవాలని. ఒక వేళ ఇదివరకే సూపర్‌ సేవర్‌ కార్డు ఉంటే రూ.59తో రీచార్జ్‌ చేస్తే సరిపోతుంది. తద్వారా రెండ్రోజుల పాటు అపరిమితంగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే వీలు ఉంటుంది. పండగ వేళ మెట్రో రైళ్లలో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. దాంతో.. యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్‌తో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది హైదరాబాద్ మెట్రో.


Next Story