వరదల ఎఫెక్ట్‌..హైదరాబాద్-విజయవాడ హైవేపై రాకపోకలు బంద్

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  28 July 2023 11:47 AM IST
Heavy Flood, Hyderabad-Vijayawada, Highway Blocked,

వరదల ఎఫెక్ట్‌..హైదరాబాద్-విజయవాడ హైవేపై రాకపోకలు బంద్

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వరద నీరు పొటెత్తడంతో గురువారం సాయంత్రం నుంచే రాకపోకలను నిలిపివేశారు అధికారులు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మంలో మున్నేరు పొంగి ప్రవహిస్తోంది. కంచికచర్ల మండలం కీసర దగ్గర ఎన్టీఆర్ జిల్లాలోకి మున్నేరు వాగు ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో రెగ్యులర్‌ సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోందని అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరుతుందని తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించగలరంటూ విజ్ఞప్తి చేస్తూ ఆర్టిసి ఎండి సర్జనార్ తన ట్యూటర్ లో పోస్ట్ చేశారు.

విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు రాజమండ్రి- ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ – దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి – హైదరాబాద్ కు వెళ్ళాలని అధికారులు ప్రకటించారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఎప్పటికప్పుడు మార్పు గమనించాలని సూచిస్తున్నారు అధికారులు. ట్రాఫిక్ సమాచారం కోసం పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 7328909090 కు సంప్రదించాల్సిందిగా సూచించారు.

ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాల కారణంగా వాగుల వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తునందున ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. నందిగామ మండలం కీసర టోల్ గేట్ దాటిన తరువాత ఐతవరం వద్ద హైవే మీద భారీగా నీరు చేరింది. ముందస్తు రక్షణ చర్యలలో భాగముగా రహదారిని మూసి వేశారు. వరదలో చిక్కకున్న వారిని క్రేన్ సహాయంతో రక్షించారు.


Next Story