పెన్షనర్లకు శుభవార్త.. ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్
పోస్టల్ శాఖ ప్రతినెలా పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 13 Sept 2024 9:30 PM ISTపోస్టల్ శాఖ ప్రతినెలా పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను పెన్షనర్లకు ఇబ్బంది కలగకుండా.. వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందించాలని పోస్టల్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిపార్ట్‌ముంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ పేరిట డీఎల్‌సీ 3.0 ప్రచారాన్ని చేపట్టింది. ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అందించనున్నారు అధికారులు.
ఇక దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద నగరాలతోపాటు జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పోస్టల్ శాఖ భావిస్తుంది. ఈ అంశంపై గురువారం పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు న్యూడిల్లీలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అందించే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఈ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీని కోసం బ్యానర్లు, సోషల్ మీడియా. SMS, షార్ట్ వీడియోల ద్వారా పెన్షనర్లకు చేరేలా ప్రచారం నిర్వహించాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి వారికి సూచించారు. అందుకే సంబంధించిన సాంకేతిక సహాయం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందిస్తుందని వారు చెప్పారు. అయితే.. గత ఏడాది 2023లో సైతం పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 2.0 పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు.