మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఇవాళ, రేపు అర్ధరాత్రి వరకు వైన్స్ ఓపెన్
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మందుబాబులకి గుడ్‌న్యూస్ తెలిపాయి.
By Srikanth Gundamalla Published on 31 Dec 2023 10:56 AM ISTమందుబాబులకు గుడ్‌న్యూస్.. ఇవాళ, రేపు అర్ధరాత్రి వరకు వైన్స్ ఓపెన్
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మందుబాబులకి గుడ్‌న్యూస్ తెలిపాయి. న్యూఇయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు. ఎక్కడి వారు అక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పార్టీలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేలా పలువురు నిర్వాహకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. పార్టీ ఏదైనా సరే కానీ.. మందు ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పాయి. డిసెంబర్ 31తో పాటు కొత్త ఏడాది జనవరి 1వ తేదీన ఈ రెండ్రోజుల పాటు వైన్స్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయని తెలిపింది. ఇక బార్లు, క్లబ్స్ అనుమతితో జరిగే ఈవెంట్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఉంటుందని ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది.
న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మరోవైపు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లకు పలు సూచనలు చేశారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో రైడ్లను క్యాన్సిల్ చేయొద్దని చెప్పారు. డ్రంక్ డ్రైవ్ చేసి పట్టుబడితే భారీ జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెబుతున్నారు పోలీసులు.
మరోవైపు హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవలను పొడిగించారు. అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. ఈ సేవలను హైదరాబాద్ నగర వాసులు వినియోగించుకోవాలని సూచించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు చివరి స్టేషన్‌కు మెట్రో రైళ్లు చేరుకుంటాయని చెప్పారు మెట్రో ఎండీ. మద్యం సేవించి హంగామా చేసినా.. సిబ్బందితో గొడవలు పెట్టుకున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్లలో పోలీసుల నిఘా ఉంటుందని ప్రయాణికులంతా సహకరించాలని కోరారు మెట్రో ఎండీ.