రూ.78వేలు దాటేసిన బంగారం ధర.. కారణమేంటి..?
తాజాగా గురువారం కూడా బంగారం ధర మరోసారి పెరిగింది.
By Srikanth Gundamalla Published on 26 Sep 2024 1:30 PM GMTదేశంలో బంగారం ధర పెరుగుతూనే ఉంది. తాజాగా గురువారం కూడా బంగారం ధర మరోసారి పెరిగింది. గరిష్టస్థాయికి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల కు గాను 400 రూపాయలు పెరిగి.. రూ.78వేల మార్కును చేరుకుంది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడం, దేశీయంగానూ వర్తకుల నుంచి కొనుగోళ్లు కొనసాగుతుండటంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
కాగా.. బుధవారం రూ.77,850 వద్ద ముగిసిన బంగారం గురువారం మరో రూ.400 పెరిగింది. దాంతో గరిష్ఠమైన రూ.78,250 మార్కును దాటినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. మరోవైపు వెండి కూడా భారీ ధర పలుకుతోంది. పసిడితో సమానంగా డిమాండ్ కొనసాగుతోంది. కిలో వెండి వెయ్యి రూపాయలు పెరిగింది. దాంతో.. రూ.94వేల మార్కుని చేరుకుంది.
ద్రవ్యోల్బణం కట్టడికి ఇన్నాళ్లూ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చాయి. అయితే.. ఇప్పుడు వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ముందుకొస్తున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పసిడికి డిమాండ్ ఏర్పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. అంతేకాదు.. డాలరు ధర కూడా క్షీణించిందనీ.. ఇది కూడా బంగారంధర పెరగడానికి మరో కారణమని వెల్లడించారు.