గోదావరి ఉగ్రరూపం, భద్రచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 9:54 AM ISTగోదావరి ఉగ్రరూపం, భద్రచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి నీటిమట్టం 53.1 అడుగులుగా ఉంది. ప్రవాహం 14.32 లక్షల క్యూసెక్కులకు చేరింది. దాంతో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాదు.. ప్రతి గంటకూ వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. శనివారం ఉదయం వరకు గోదావరి నీటిమట్టం 54.3 అడుగులకు చేరింది.
గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన ఏటూరునాగారం, పేరూరు నుంచి వరద వస్తోంది. దాంతో.. గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో.. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ నిరంతరం గోదావరి వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చోట్ల సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు.. అత్యవసర సేవలు అందించేందుకు హెలికాప్టర్‌తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, పార్వతి, సరస్వతి, మేడిగడ్డ బ్యారేజ్‌ల గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ఇక మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రోడ్లపైకి నీళ్లు చేరాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తెలంగాణ-చత్తీస్‌గఢ్ హైవేపైకి కూడా వరద నీరు చేరింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి.