ఆ చిన్నారికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తా - ఇండిగో సీఈఓ

By -  Nellutla Kavitha |  Published on  9 May 2022 1:58 PM GMT
ఆ చిన్నారికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తా - ఇండిగో సీఈఓ

దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్న వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. చిన్నారి ఆందోళనతో ఉన్నాడని, దానివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని ఇండిగో విమాన సిబ్బంది చిన్నారిని, అతడి కుటుంబ సభ్యులని విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీజీసీఎ విచారణకు ఆదేశించింది. దీంతోపాటుగానే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తానే స్వయంగా దర్యాప్తు చేపడతానని ప్రకటించారు.

గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఒక కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. హైదరాబాద్ కు వెళ్ళడానికి ఇండిగో విమాన టికెట్లను కూడా తీసుకున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఆ చిన్నారి భయాందోళనలతో ఉన్నాడని, దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది అనే కారణంతో చిన్నారిని విమానం ఎక్కనివ్వలేదు ఇండిగో సిబ్బంది. ఈ వ్యవహారంపై ఇండిగో సీఈవో రోనో జాయ్ దత్త విచారం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తమ సిబ్బంది చిన్నారిని విమానం ఎక్కనివ్వలేదని చెప్పారు. చిన్నారి కుటుంబం ప్రయాణానికి వీలుగా చెక్ ఇన్, బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ బాలుడు భయాందోళనలతో ఉన్నాడని, అయితే భద్రతా మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో, సిబ్బంది కఠిన నిర్ణయం తీసుకున్నారని ఇండిగో సీఈవో వెల్లడించారు. దివ్యాంగుల కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్నవారే సమాజంలో నిజమైన హీరోలని, తల్లిదండ్రుల అంకితభావానికి అభినందనగా ఆ బాలుడికి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొని ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా ఇండిగో సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు.

దివ్యాంగ బాలుడిని విమానంలో ఎక్కనివ్వని వ్యవహారాన్ని తోటి ప్రయాణికురాలు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. ఇండిగో సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో వెంటనే రెస్పాండ్ అయింది ఇండిగో సంస్థ. చివరి నిమిషం దాకా గ్రౌండ్ సిబ్బంది వేచి చూసినా బాలుడు స్తిమితపడలేదని, దాంతో ఇతరులకు, చిన్నారి కుటుంబానికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామని వెల్లడించింది. శనివారం రోజు వారికి ఒక హోటల్ లో వసతి సౌకర్యం కల్పించి, ఆదివారం ఉదయమే గమ్యస్థానానికి చేర్చినట్లుగా ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ప్రతి నెల తమ విమానాల్లో 75 వేల మంది దివ్యాంగులు ప్రయాణాలు చేస్తుంటారని, అందరినీ కలుపుకుని వెళ్లే సంస్థ తమదని ప్రకటన విడుదల చేసింది.

ఇక ఈ సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది. ఇండిగో సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏ వ్యక్తికి అలాంటి అనుభవం రాకూడదని, స్వయంగా తానే దర్యాప్తు చేపడతానని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని ట్విట్టర్ వేదికగా తెలిపారు కేంద్రమంత్రి సింధియా.

Next Story