ప్రచారానికి తెర.. తెలుగు రాష్ట్రాల్లో మైకులు బంద్

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటలతో తెరపడింది.

By Srikanth Gundamalla  Published on  11 May 2024 12:58 PM GMT
election, campaign, end,  telugu states,

 ప్రచారానికి తెర.. తెలుగు రాష్ట్రాల్లో మైకులు బంద్ 

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటలతో తెరపడింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది. ఏపీ, తెలంగాణతో పాటు పది రాష్ట్రాల్లో ఈ నాలుగో దశలో పోలింగ్ సాగనుంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పాటు.. అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్‌ జరుగుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలు, ఏపీలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. కాగా.. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా పేరున్న అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. సమస్య ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు ప్రచారం జరుగుతుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా 169 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. అయితే.. ముందుగా సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్‌ సమయం అని ఈసీ ప్రకటించగా.. ఎండల కారణంగా ప్రజలకు బయటకు రారు అనీ.. సాయంత్రం వేళ పోలింగ్ సమయాన్ని పొడగించాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. దాంతో.. ఎన్నికల సంఘం అధికారులు కూడా పోలింగ్ సమయాల్లో సడలింపులు చేశారు.

తెలంగాణలో ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మిగతా 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

Next Story