అగ్ని క్షిపణి పితామహుడు ఇక లేరు

‘అగ్ని’ క్షిపణుల రూపకర్తగా గుర్తింపు పొందిన డాక్టర్‌ రామ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ (84) కన్నుమూశారు.

By Srikanth Gundamalla  Published on  16 Aug 2024 6:51 AM IST
drdo, scientist, ram narain agarwal, passed away ,

అగ్ని క్షిపణి పితామహుడు ఇక లేరు  

ప్రముఖ డీఆర్డీవో శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణుల రూపకర్తగా గుర్తింపు పొందిన డాక్టర్‌ రామ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ (84) కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన గురువారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామ్‌ నారాయణ్ అగర్వాల్‌ మృతిచెందారు. అగ్ని క్షిపణి ప్రాజెక్టుకు తొలి డైరెక్టర్‌గా రామ్‌ నారాయణ్ అగర్వాల్ వ్యవహరించారు. అలాగే.. అగర్వాల్‌ను అగ్నిమ్యాన్‌గా పేర్కొంటున్నట్లు డీఆర్డీవో వర్గాలు చెప్పాయి. డీఆర్డీవో ఒక లెజెండ్‌ను కోల్పోయిందని ఆ సంస్థ మాజీ చీఫ్, క్షిపణి శాస్త్రవేత్త డా.జి.సతీశ్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అగర్వాల్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ఎల్‌గా పదవీ విరమణ చేశారని.. రెండు దశాబ్దాలకు పైగా అగ్ని క్షిపణి ప్రోగ్రామ్‌కు సారథ్యం వహించిన ఘనత ఆయనదేనని డీఆర్‌డీవో కొనియాడింది. పద్మశ్రీ, పద్మభూషణ్‌ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న డాక్టర్‌ అగర్వాల్‌ మృతి విచారకరమని తెలిపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది.


దేశానికి ఆయన చేసిన సేవలకు గాను 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది. 2004లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును అగర్వాల్ అందుకున్నారు. లాంగ్ రేంజ్ క్షిపణుల అభివృద్ధిలో అగర్వాల్ పేరు సంపాదించుకున్నారు. ప్రఖ్యాత ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. అగర్వాల్‌కు డీఆర్డీవోతో దశాబ్దాల అనుబంధం ఉంది. 1983లో ప్రారంభమైన అగ్ని క్షిపణి కార్యక్రమానికి అగర్వాల్ నాయకత్వం వహించారు. అయితే.. అగర్వాల్ ఐఐటీ మద్రాస్, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చదువుకున్నారు.

Next Story