కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు కోర్టులో భారీ ఊరట
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 2:39 PM GMTకాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు కోర్టులో భారీ ఊరట
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. అజారుద్దీన్‌కు మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని అజారుద్దీన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన లావ్ నాగేశ్వర్‌రావు కమిటీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మల్కాజ్ గిరి కోర్టు ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపి అజారుద్దీన్ కు ఊరట కల్పించింది. ముందుస్తు బెయిల్ ఇచ్చింది. 41 సీఆర్పీసీ కింద అజారుద్దీన్ కు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. అటు అజారుద్దీన్ ను కూడా పోలీసుల విచారణకు సహకరించాలని చెప్పింది. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు.
అజారుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో నామినేషన్ వేయాల్సి ఉంది. ఈ సమయంలో కేసులో చిక్కుకున్న అజారుద్దీన్ కు బెయిల్ రాకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండేది. ఎట్టకేలకు ముందస్తు బెయిల్ రావడం వల్ల అజారుద్దీన్ నామినేషన్ వేయడానికి మార్గం సుగమం అయింది.