గుడ్‌న్యూస్‌.. తగ్గిన ఎల్పీజీ గ్యాస్‌ ధరలు

కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందే మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla
Published on : 1 July 2024 8:15 AM IST

commercial gas cylinder, rates, decrease,

గుడ్‌న్యూస్‌.. తగ్గిన ఎల్పీజీ గ్యాస్‌ ధరలు

కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందే మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. జూలై 1 నుంచి 19 కిలోల ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గించింది. ఈ క్రమంలోనే ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్ ధరను రూ.30 తగ్గించాయి. ఐవోసీఎల్ వెబ్‌సైట్ ప్రకారం తగ్గించిన గ్యాస్‌ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే.. 14.2 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్ ధరల్లో మాత్రం కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు పూర్తిస్థాయిలో ఊరట లభించలేదు. ఎక్కువ శాతం డొమెస్టిక్‌ సిలిండర్ల వినియోగదారులే ఉండటం గమనార్హం.

19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.30 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల LPG గ్యాస్ ధర రూ.1646గా ఉంది.అలాగే తెలంగాణలోని హైదరాబాద్‌లో 19 కిలోల LPG గ్యాస్ ధర 72 రూపాయలు తగ్గి రూ. 1903.50కి చేరింది. ఏపీలోని విజయవాడలో రూ.32 తగ్గి రూ.1832.50కి చేరుకుంది. మరోవైపు ఈ సిలిండర్ కోల్‌కతాలో రూ.1756కి అందుబాటులో ఉంది. ముంబైలో రూ.1598, చెన్నైలో సిలిండర్ రూ.1809గా ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు కొనసాగుతున్నాయి.

14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది ఢిల్లీలో రూ. 803, హైదరాబాద్‌లో రూ.855, ఏపీలోని అమరావతిలో రూ.844.50, కోల్‌కతాలో రూ. 829 గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు రూ. 603కే ఈ సిలిండర్ లభించనుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.72 తగ్గించాయి. ఇప్పుడు జూలైలో రూ.30 తగ్గింది.

Next Story