చంద్రయాన్‌-3 కోసం చెల్లి పెళ్లికి కూడా దూరం

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయ్యిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  26 Aug 2023 7:25 AM IST
Chandrayaan-3, Project Manager, veeramuthuvel,

 చంద్రయాన్‌-3 కోసం చెల్లి పెళ్లికి కూడా దూరం

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ప్రపంచ దేశాలన్నీ మరోసారి భారత్‌వైపు చూశాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై మొదటిసారి కాలుమోపిన దేశంగా భారత్ నిలిచింది. ఇంతటి విజయంలో చాలా మంది కృషి ఉంటుంది. ముఖ్యంగా కీలకపాత్ర పోషించిన వ్యక్తి చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌ పి. వీరముత్తువేల్. భారత్‌ మూన్‌పై కాలు పెట్టడం కోసం విజయం సాధించడంలో ఆయన కృషి చాలా ఉంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యాక దేశం మొత్తం సంబరాలు చేసుకుంది.. ఒక్క వ్యక్తి మాత్రం ఒంటరిగా ఆనంద బాష్పాలు రాల్చారట.

ఆయనే చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్ తండ్రి పి. పళనివేల్. ఈ మిషన్ కోసం తన కుమారుడు చేసిన కృషిని దగ్గరుండి చూశారు. ఆయన తాజాగా అందరితో చంద్రయాన్‌-3 మిషన్ కోసం వీరముత్తువేల్ పడిన కష్టాన్ని పంచకున్నారు. చంద్రయాన్‌-3 మిషన్‌ కోసం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.వీరముత్తువేల్‌ తన సొంత ఇంటి సంతోషాల్ని కూడా వదులుకున్నారు. నెలల తరబడి ఇంటికి రాలేదని గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్-3 విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సైంటిస్టులు అయితే కొందరు తనతో కూడా ఫొటోలు తీసుకున్నారని ఆనంద బాష్పాలు కార్చారు.

వీరముత్తువేల్ చంద్రయాన్-3 మిషన్ స్టార్ట్‌ చేశాక.. ఇంటికే రాలేదని ఆయన తండ్రి చెప్పారు. ఈ నెల 20న జరిగిన తన చెల్లి పెళ్లి కూడా హాజరుకాలేదని తెలిపారు పళనివేల్. చంద్రునిపై దిగాల్సిన రష్యా ల్యాండర్ ఫెయిల్ అవ్వడంతో.. ప్రపంచ దృష్టి అంతా భారత్‌లోని ఇస్రోపై పడింది. దాంతో.. ఆయన మిషన్‌ విజయవంతం కావాలని పూర్తిగా నిమగ్నమయ్యారు. ఆ క్రమంలోనే చెల్లి పెళ్లికి కూడా రాలేదని పళనివేల్ తెలిపారు. కాగా.. చంద్రయాన్-3 సెక్సెస్ అయ్యాక సొంతూరు విళుపురంలోని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులంతా సంబరాలు చేసుకున్నామని తెలిపారు. అయితే.. తన కుమారుడు చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగం అయ్యినందుకు గర్వ పడుతున్నానని పళనివేల్ ఆనందం వ్యక్తం చేశారు.

పి.వీరముత్తువేల్ తండ్రి పళనివేల్ మాజీ రైల్వే ఉద్యోగి. పీరముత్తువేల్‌ ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేశాడు. మద్రాస్ ఐఐటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత అంతరిక్ష శాస్త్రవేత్త అవ్వాలని, ఇస్రోలో చేరాలని కలలు కని.. వాటి సాధ్యం కోసం ఎంతో కష్టపడ్డారు. చివరకు అనుకున్నది చేశారు. తాజాగా చంద్రయాన్-3 విజయంలో కీలక పాత్రపోషించారు.

Next Story