జగనే ఇష్టనాయకుడు అంటూ..చంద్రబాబు అరెస్ట్‌పై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు

హీరో విశాల్‌ చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 Sep 2023 6:49 AM GMT
Chandrababu Arrest, Hero Vishal,  CM Jagan,

జగనే ఇష్టనాయకుడు అంటూ..చంద్రబాబు అరెస్ట్‌పై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్‌ అయ్యిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీలో రచ్చ కొనసాగుతోంది. టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తున్నారు. ఆయన అరెస్ట్‌ అక్రమం అని.. వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ నాయకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. ఈ క్రమంలోనే హీరో విశాల్‌ కూడా చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ గురించి రెండు సార్లు కీలక వ్యాఖ్యలు చేశారు హీరో విశాల్. టీడీపీ అధినేత చంద్రబాబు గొప్ప నాయకుడు అని.. ఆయన్ని అరెస్ట్‌ చేయడం బాధాకరమని అన్నారు. చంద్రబాబును అరెస్ట్‌ చేయడాన్ని చూసినప్పుడు చాలా భయం వేసిందని ఇటీవల వ్యాఖ్యానించారు. చంద్రబాబులాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. తనలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటని హీరో విశాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఇదే అంశంపై హీరో విశాల్ స్పందించారు. ఒక వైపు సీఎం జగన్‌కు మద్దతు తెలుపుతూనే.. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో ఏపీ సర్కార్‌ లోతుగా ఆలోచించి ఉండాల్సింది అని హీరో విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే.. తన అభిమాన రాజకీయ నాయకుడు సీఎం జగనే అని.. అయినప్పటికీ కూడా చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో మాత్రం ఆవేదనకు గురవుతున్నట్లు చెప్పారు వివాల్. చంద్రబాబుని అరెస్ట్‌ చేసే ముందు సీఐడీ అధికారులు కూడా మరింత లోతుగా ఆలోచించాల్సి ఉండాలని.. పక్కాగా ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్‌ చేసి ఉంటే బాగుండేదని అన్నారు. అయితే.. తాను ఈ వ్యాఖ్యలు సినీ నటుడిగా చేయడం లేదని.. ఒక సామాన్య వ్యక్తిగా తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నానని హీరో విశాల్ అన్నారు. విశాల్‌ కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఓ వైపు జగన్‌ తన అభిమాన నాయకుడు అని చెప్తూనే.. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడం పట్ల పలువురు చర్చించుకుంటున్నారు.

Next Story