మోగిన ఎన్నికల నగారా, నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 12:50 PM IST
మోగిన ఎన్నికల నగారా, నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వివరాలను వెల్లడించారు. సీఈసీ రాజీవ్ కుమార్ ఈమేరకు మాట్లాడుతూ తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించారు.
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 నియోజకవర్గాలు ఉన్నాయని.. అక్కడ అన్నింటిల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 10వ తేదీగా పేర్కొన్నారు. నవంబర్ 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని.. ఉపసంహరణకు సమయం నవంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక నవంబర్ 30వ తేదీన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని.. ఒకేవిడతలో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీన ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే.. తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీనే ఉంటాయని చెప్పారు.
ఇక రాజస్థాన్‌లో నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా.. మధ్యప్రదేశ్‌లో పోలింగ్ నవంబర్ 7వ తేదీన జరుగుతాయి. మిజోరంలో కూడా నవంబర్ 7 తేదీన ఎన్నికలు ఉంటాయని సీఈసీ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. చత్తీస్‌గడ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత నవంబర్ 7న జరగనుండగా.. రెండో విడత పోలింగ్ నవంబర్ 17వ తేదీన జరగనున్నాయి. అయితే.. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల టెన్షన్ ఉన్న కారణంగా రెండు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యను కూడా తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో 3.17 కోట్ల మంది, రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది ఓటర్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది ఓటర్లు, చత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఓటర్లు, మిజోరంలో 8.52 లక్షల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 200, చత్తీస్‌గఢ్‌లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.