కెనడాలో బర్త్‌డే వేడుకల్లో విషాదం, సరస్సులో మునిగి తెలుగు విద్యార్థి మృతి

కెనడాలోని టొరంటోలో హైదరాబాద్ వాసి ఒకరు సరస్సులో ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు.

By Srikanth Gundamalla  Published on  16 Sept 2024 8:00 PM IST
కెనడాలో బర్త్‌డే వేడుకల్లో విషాదం, సరస్సులో మునిగి తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్: కెనడాలోని టొరంటోలో హైదరాబాద్ వాసి ఒకరు సరస్సులో ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌కు చెందిన ప్రణీత్‌గా గుర్తించారు. కెనడాలో చదువు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా.. మృతుడు చదువు కోసం 2019లో కెనడాకు వెళ్లాడు. అతని అన్న 2022లో వెళ్లాడు.అన్నదమ్ములిద్దరూ ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లి అక్కడే ఉంటున్నారు.

ప్రణీత్ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 14న ప్రణీత్ తన అన్నయ్య పుట్టినరోజు కోసం తన స్నేహితులతో కలిసి లేక్ క్లియర్ సమీపంలోని ఒక కాటేజీకి వెళ్లాడు. నలుగురు స్నేహితులు సరస్సులో ఈతకు వెళ్లగా, ప్రణీత్ ఒక్కడే తప్పిపోయాడు. అతను నీట మునిగిపోయినట్లు బృందం గుర్తించింది. ఈ విషయాన్ని వారు వెంటనే పోలీసులకు అందించారు. దాంతో.. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కాసేటి తర్వాత మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కెనడియన్ అధికారులతో సమన్వయం మాట్లాడి.. తమ కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ప్రణీత్‌ కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

Next Story