బ్యాడ్‌ న్యూస్‌.. హాస్టల్‌ ఫీజులపై 12 శాతం జీఎస్టీ వసూలు

హాస్టళ్లలో ఉండేవారికి ఇక మీద భారం పడే అవకాశం ఉంది. వారు చెల్లించే ఫీజులపై ఇక మీద నుంచి 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.

By Srikanth Gundamalla  Published on  31 July 2023 4:36 AM GMT
Bad News, Hostel, accommodation, Fee, GST 12%,

బ్యాడ్‌ న్యూస్‌.. హాస్టల్‌ ఫీజులపై 12 శాతం జీఎస్టీ వసూలు

పట్టణాల్లో ఒకరే ఉండాలంటే సరైన మార్గం హాస్టల్ అనుకుంటారు. అక్కడే ఉంటూ ఉద్యోగం.. కోర్సులు.. చదువుకునే వారు తాము వచ్చిన పని చేసుకుంటారు. దాని కోసం కొంత మొత్తంలో అద్దె చెల్లిస్తారు. అయితే ఇలాంటి వారికి బ్యాడ్‌ న్యూస్‌ ఎదురైంది. హాస్టళ్లలో ఉండేవారికి ఇక మీద భారం పడే అవకాశం ఉంది. వారు చెల్లించే ఫీజులపై ఇక మీద నుంచి 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు జీఎస్టీ అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్ (ఏఏఆర్) బెంచ్‌లు రెండు వేర్వేరు కేసుల్లో తీర్పును వెలువరించాయి. నివాస గృహాల కిందకు హాస్టల్స్, డార్మిటరీలు రావని.. కాబట్టి వీటికి జీఎస్టీ నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదని బెంగళూరు, లక్నో బెంచ్‌లు తీర్పు వెలువరించాయి.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శ్రీసాయి లగ్జరీయిస్‌ స్టే ఎల్‌ఎల్పీ సంస్థ దాఖలు చేసిన దరఖాస్తుపై బెంగళూరు బెంచ్ తీర్పు ఇచ్చింది. నివాస గృహాల కిందకు హాస్టళ్లు రావని తెలిపింది. వాటికి కూడా జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రోజుకు రూ. 1000 కంటే తక్కువ అద్దె వసూలు చేసే హాస్టళ్లకు 2022 జూలై 17 వరకు మాత్రమే జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో హాస్టళ్లపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టంచేసింది.

గృహ వసతులకు మాదిరే హాస్టళ్లకు కూడా అద్దె వసూలు చేస్తున్నారు కాబట్టి.. వీటికి కూడా జీఎస్టీ వర్తించదని కర్ణాటకలోని హాస్టళ్లను నిర్వహిస్తున్న శ్రీసాయి సంస్థ ఏఏఆర్ ముందు వాదించింది. హాస్టళ్లలో ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులకు షేరింగ్ పద్ధతిలోగదులను కేటాయిస్తారని ఏఏఆర్ తెలిపింది.. బెడ్‌ల వారీగా ఫీజులు వసూలు చేస్తారనీ.. వ్యక్తిగత కిచెన్ ఉండదని పేర్కొంది. వంటకు అనుమతించరు. ఇవి శాశ్వత గృహ వసతి లక్షణాల కిందకు రావని ఏఏఆర్ స్పష్టం చేసింది.

కాగా.. నోయిడాకు చెందిన వీఎస్ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హాస్టల్స్‌ సంస్థ కూడా ఇదే తరహా పిటిషన్ వేసింది. వసతి, భోజనం, విద్యుత్, వైఫై ఇంటర్నెట్ వంటి అన్ని నివాస సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపింది. అందుకు గాను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. సదురు సంస్థ వాదనను విన్న ఏఏఆర్ లక్నో బెచ్ తిరస్కరించింది. గృహ వసతి శాశ్వత నివాసానికి సంబంధించిందని పేర్కొంది. హాస్టళ్లు, గెస్ట్‌ హౌజ్‌లు, లాడ్జిలు వంటివి శాశ్వత నివాసం కిందకు రావని స్పష్టం చేసింది.


Next Story