ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ ఘనత, డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక

ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన మహిళ అరుదైన ఘనతను సాధించారు.

By Srikanth Gundamalla  Published on  8 Sept 2023 7:50 AM IST
Australia, strathfield, deputy mayor, telangana woman,

 ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ ఘనత, డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక

ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన మహిళ అరుదైన ఘనతను సాధించారు. న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్‌ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా తొలిసారిగా తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన పట్లోళ్ల శంకర్‌రెడ్డి, సారారెడ్డి కుమార్తె సంధ్యారెడ్డి. ఖైరతాబాద్‌లోనే ఆమె స్టాన్లీ కాలేజ్‌లో ఇంటర్మీడియట్‌ వరకు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయవాద పట్టా పొందారు. ఉస్మానియాలో ఎంఏ చేశారు. 1991లో కర్రి బుచ్చి రెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో సంధ్యారెడ్డి వివాహం జరిగింది. పెళ్లి అయ్యాక సంధ్యారెడ్డి భర్తతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడి ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్‌ లా డిగ్రీ పొందారు సంధ్యారెడ్డి. ఆ తర్వాత ఆమె ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేశారు. స్థానికంగా భర్తతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె చొరవతో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం స్ట్రాత్‌ఫీల్డ్‌లోని హోమ్‌బుష్‌ కమ్యూనిటీలో ఏర్పాటు చేశారు.

సంధ్యారెడ్డి సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్ ఆఫ్‌ది ఇయర్ పురస్కారం కూడా లభించింది. 2021లో ఆమె నివాసం ఉండే స్ట్రాత్‌ఫీల్డ్‌ పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగాయి. స్థానికంగా ఉన్న ప్రవాసభారతీయులతో పాటు ఆస్ట్రేలియా వాసులు సైతం ఆమెను పోటీ చేయాలని కోరారు. స్థానిక లేబర్‌, లిబరల్‌ పార్టీల అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేసి సంధ్యారెడ్డి విజయం సాధించారు. ఈ పురపాలక సంఘానికి ఏటా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు జరుగుతాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంధ్యారెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నీల్‌రెడ్డి, నిఖిల్‌రెడ్డి ఇద్దరూ ఆమె కుమారులు. నిఖిల్‌రెడ్డి ఈ ఏడాది ఆస్ట్రేలియా జాతీయ చందరంగం చాంపియన్‌గా నిలిచాడు. కాగా.. డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉందని సంధ్యారెడ్డి తెలిపారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని కొనియాడుతున్నారు.

Next Story