భారత్ ఓటమి నుంచి నేను ఇదే నేర్చుకున్నా: ఆనంద్ మహీంద్ర

వన్డే వరల్డ్ కప్‌ ఆరో సారి విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  20 Nov 2023 5:10 AM GMT
anand mahindra,  world cup, final match,

 భారత్ ఓటమి నుంచి నేను ఇదే నేర్చుకున్నా: ఆనంద్ మహీంద్ర

వన్డే వరల్డ్ కప్‌ ఆరో సారి విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌ వరకు ఒక్క ఓటమి లేకుండా వచ్చిన భారత్‌కు ఓటమి ఎదురైంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆరో సారి వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే.. టీమిండియా ఇటు బ్యాటింగ్‌లో.. అటు బౌలింగ్.. ఫీల్డింగ్‌లోనూ అనుకున్నంతగా రాణించలేకపోయింది. చివరకు పరాజయం తప్పలేదు. మరోవైపు కప్‌ ఈసారి మనమే కొడతామని భావించిన టీమిండియా అభిమానులు నిరాశ చెందారు. స్పోర్ట్స్‌ అంటేనే గెలుపోటములు కాబట్టి.. టీమిండియాకు తామెప్పుడు తోడుగా ఉంటామని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు సపోర్ట్‌గా పలువురు ప్రముఖులు కామెంట్స్‌ చేస్తున్నారు. భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా ఇలానే స్పందించారు.

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపై ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. గెలుపు కోసం పోరాడిన టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. గెలుపోటములు.. జీవిత సత్యాల గురించి ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఒక పోస్టు పెట్టారు. అణుకువ, వినయం నేర్పించడంలో క్రీడలకు మించిన గురువు ఎవరూ లేరన్నారు. అయితే.. ఏ రకంగా చూసినా టీమిండియా అద్భుతంగా రాణించిందని చెప్పారు. ఆశించిన దానికంటే ఎక్కువ విజయాలనే సొంతం చేసుకుందని ఆనంద్ మహీంద్ర చెప్పారు. ఈ సమయంలో అందరమూ భారత క్రీడాకారులకు అండగా నిలవాలని కోరారు. జీవితంలో ముందుకు సాగాలంటే ఓటమిని కూడా అంగీకరించాలని.. ఇదే తాను నేర్చుకున్నానని ఆనంద్‌ మహీంద్ర పేర్కొన్నారు.

ఓటమిని కూడా స్వీకరించాలని.. ఆ భావాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకూడదు అని అన్నారు. కాబట్టి తన పరిస్థితిని ప్రతిబింబించేలా ఒక ఫొటోను షేర్‌ చేస్తున్నా అంటూ ఆ ఫోటో కూడా నెటిజన్లతో పంచుకున్నారు ఆనంద్ మహీంద్ర. ఆ ఫోటోలో ఓ వ్యక్తి ఒంటరిగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. మరో అవకాశం కోసం ఎదురుచూడాలని వచ్చినప్పుడు వినియోగించుకోవాలని ఆ ఫొటో పరమార్థం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆనంద్‌ మహీంద్ర పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story