పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా
ఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 5:21 AM GMTపరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా
ఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఇది జరిగిన కొద్దిరోజులే యూజీసీ నెట్ పరీక్ష లీకుల విషయం తెరపైకి వచ్చింది. దాంతో.. ప్రభుత్వం యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల నిర్వహణపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పరీక్షల్లో అక్రమాల కట్టడికి కేంద్ర ప్రబుత్వం చర్యలను మొదలుపెట్టింది. ప్రభుత్వ పరీక్షల చట్టం-2024కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కిందటే ఆమోదం పొందిన ఈ చట్ట నిబంధనలను నోటిఫై చేసింది తాజాగా కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 21వ తేదీ నుంచే చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
ఈ చట్టం ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారని తెలిపింది. అలాగే కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నది.
పోటీ పరీక్షల పేపర్ లీకుల నేపథ్యంలో ఈ చట్టాన్ని కేంద్రం నోటిఫై చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను ప్రశ్నించిన తర్వాత రోజే నోటిఫికేషన్ రావడం గమనార్హం. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024ను లోక్‌సభ ఫిబ్రవరి 6న ఆమోదించింది. 9న రాజ్యసభ ఆమోదించింది. అదే నెల 12న రాష్ట్రపతి ఈ చట్టానికి ఆమోదముద్ర వేశారు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్, ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.