ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్ గడువు మరోసారి పొడిగింపు
ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు కావాలన్నా.. ఆఫీసుల్లో ఏ చిన్న పని ఉన్నా ఆధార్ కంపల్సరీ.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 4:41 PM ISTప్రస్తుతం ప్రభుత్వ పథకాలు కావాలన్నా.. ఆఫీసుల్లో ఏ చిన్న పని ఉన్నా ఆధార్ కంపల్సరీ. గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్‌లో కొన్ని కొన్నిసార్లు మార్పులు అవసరం అవుతాయి. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. చిరునామాలు మారుతుండడంతో అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆధార్‌లో మార్పులు, చేర్పులకు UIDAI ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ వస్తోంది.
పదేళ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి కేంద్రం గడువు ఇచ్చింది. తాజాగా సమయం అయిపోయింది. ఈ నేపథ్యంలో UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఆధార్ కార్డుల్లోని వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు పేర్కొంది UIDAI. అధికార వెబ్‌సైట్ http://myaadhar.uidai.gov.inలో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అవ్వడం ద్వారా వివరాలను ఉచితంగానే అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ ఇలా అప్‌డేట్ చేసుకోవచ్చు
ముందుగా https:// myaadhaar.uidai.gov.in పోర్టల్ లోకి వెళ్లాలి. అందులో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన అనంతరం డాక్యుమెంట్ అప్‌డేట్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే స్క్రీన్‌పై వివరాలు వస్తాయి. నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి. కిందికి స్క్రోలింగ్ చేస్తే వచ్చే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే అప్‌డేట్ పూర్తయినట్లు ఫోన్ నెంబర్‌కు 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది.