సోషల్‌ మీడియా ట్రోలింగ్.. చిన్నారి తల్లి సూసైడ్..!

మూడు వారాల కిందట చెన్నైలో ఒక చిన్నారి అపార్ట్‌మెంట్‌లో షెడ్‌పై పడిపోయింది.

By Srikanth Gundamalla  Published on  20 May 2024 7:46 AM GMT
mother, suicide, social media, trolling, chennai,

సోషల్‌ మీడియా ట్రోలింగ్.. చిన్నారి తల్లి సూసైడ్..!

మూడు వారాల కిందట చెన్నైలో ఒక చిన్నారి అపార్ట్‌మెంట్‌లో ఉన్న టిన్‌ షెడ్‌పై పడిపోయింది. ఆ చిన్నారి షెడ్‌ చివరన చాలా సేపు ఆగిపోయింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించారు. లక్కీగా ఆ చిన్నారిని కాపాడారు. కిటికీ లోనుంచి ఇద్దరు వ్యక్తులు నిలబడి షెడ్‌పై ఉన్న చిన్నారిని అతి కష్టంమీద కిందకు దించారు. ఇక మరోవైపు ఆ పాప ఎక్కడ కిందపడిపోతుందన్న భయంతో కాపాడేందుకు స్థానికులు దుప్పట్లు, బెడ్‌షీట్లను పరిచి కింద పట్టుకున్నారు. చివరకు ఆ చిన్నారిని కిటికీలో నుంచి నిలబడి ఇద్దరు వ్యక్తులు కిందకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చెన్నై అవాడీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యంక్షం అయ్యింది. అది కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎలాగోలా ఆ చిన్నారిని కాపాడిన వ్యక్తులను మెచ్చుకున్నారు. ఇదే సమయంలో 8 నెలల చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలేసిన తల్లిని తిట్టిపోశారు. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలంటూ చివాట్లు పెట్టారు. తల్లి నిర్లక్ష్యం కారణంగానే పసికందు ఈ ప్రమాదంలో పడిందంటూ ఆరోపించారు. ఇక స్థానికులు కొందరు స్పందించి.. ఇది అనుకోకుండా జరిగిందనీ.. తల్లి తప్పేమీ లేదని చెప్పినా కొందరు ట్రోలర్లు ఊరుకోలేదు. పసికందు తల్లి రమ్యను ట్రోల్‌ చేస్తూ కామెంట్స్ చేశారు. తల్లి పాపను చూసుకోవడంలో ఫెయిల్‌ అయిందంటూ తిట్టిపోశారు.

కాగా.. ఇటీవల రమ్య తన పాపను తీసుకుని కరమదాయ్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అక్కడ ఆదివారం ఆమె తల్లిదండ్రుల ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఇక వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

తాజాగా ఈ సంఘటనపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. నటుడు ప్రశాంత్‌ రంగస్వామిపై ఆమె ఫైర్ అయ్యారు. రమ్యను వీడియో వైరల్‌ అయిన సమయంలో తిట్టడం వల్లే సూసైడ్ చేసుకుందంటూ ఆరోపించారు. ప్రశాంత్‌ లాంటి వ్యక్తులు.. ఈ వీడియో కింద ఎవరైతే తల్లిదండ్రులను అవమానించారో.. వారంతా ఇప్పుడు పండగ చేసుకోవచ్చని ఎక్స్‌ వేదికగా చిన్మయి రాసుకొచ్చారు.

చిన్నారి తల్లి రమ్య సూసైడ్‌ సంఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే దానిపై క్లారిటీ లేదనీ దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం. కానీ.. కొందరు మాత్రం ట్రోల్స్ భరించలేకే రమ్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story