మధ్యాహ్నం 12 గంటలకు 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. ఇవాళే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది.

By Srikanth Gundamalla  Published on  9 Oct 2023 2:54 AM GMT
5 states, election schedule,    12PM monday,

మధ్యాహ్నం 12 గంటలకు 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ మేరకు ఇవాళే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు అధికారులు. ఈ మేరకు సీఈసీ రాజీవ్‌కుమార్‌ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. కాగా.. ఈ ఏడాది తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు జరగొచ్చిన ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరిగే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల టెన్షన్‌ ఉన్న కారణంగా రెండు విడతల్లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా.. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17 తేదీతో ముగుస్తుండగా.. తెలంగాణ సహా మిగతా మూడు రాష్ట్రాల అసెంబ్లీ గడువు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద నవంబర్‌, డిసెంబర్‌లో ఎన్నికలు జరగొచ్చనీ.. డిసెంబర్‌ రెండో వారం వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది.

ముందుగా జమిలి ఎన్నికలు ఉంటాయని భావించారు. కానీ.. అలా జరగది కేంద్రం నుంచి స్పష్టత రావడంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు మార్గం సుగమం అయ్యింది. అంతేకాక ఎన్నికల అధికారులు కూడా ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ట్రైలర్‌ అని భావించవచ్చు. ఈ ఫలితాలను బట్టే లోక్‌సభ ఫలితాలను అంచనా వేసుకోవచ్చు. అయితే.. తెలంగాణలో అధికారంలో బీఆర్ఎస్‌ ఉంది. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండగా.. మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతో.. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇవి ట్రైలర్‌ లాంటిదని విశ్లేషకులు అంటున్నారు.

Next Story