కశ్మీర్ లో సామాన్యులపై దాడులను ఆపడానికి ఉన్నత స్థాయి భేటి రేపు
High Level Meeting Tomorrow To Discuss On Kashmir
By - Nellutla Kavitha |
జమ్మూ కశ్మీరులో సామాన్య ప్రజలపై ఉగ్రవాదులు చేస్తున్న వరుస దాడులపై కేంద్రం అలర్ట్ అయింది. సామాన్యులే లక్ష్యంగా జరుగుతున్న అటాక్స్ ఆపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్ర హోం శాఖ అత్యున్నత స్థాయి సమావేశం రేపు జరుగబోతోంది. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఈ కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తదితరులు హాజరుకానున్నారు. సామాన్యులకు భద్రత, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కోవడానికి అమలు చేయవల్సినా వ్యూహాలపై వీరు చర్చిస్తారు.
కశ్మీర్ లోయలో ఇటీవల సామాన్యులపై ఉగ్రవాద దాడులు పెరుగుతుండటంతో అజిత్ దోవల్ ఈరోజు కేంద్రమంత్రి అమిత్ షాతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కూడా హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో బుడ్గాం, కుల్గాం జిల్లాల్లో టీచర్లు, ప్రభుత్వోద్యోగులను ఉగ్రవాదులు వరుసగా హత్యలు చేస్తున్నారు. మే 1 నుంచి ఇప్పటివరకు కశ్మీర్ లో అలా ఎనిమిది మంది మరణిస్తే, అందులో డ్యూటీలో లేని ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు ఉన్నారు.
జమ్మూ కశ్మీరులో ఉన్న ఉగ్రవాద శక్తులు సామాన్యు పౌరులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనే విధానాన్ని అనుసరిస్తున్నట్లు నిఘా సమాచారం అందినట్లు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. వీరిపై ఏ తరహా విధానం అమలుచేయాలనే దానిపై రేపు అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయిస్తారు.