మూసీ నదికి వరద ఉద్దృతి - ఇంకా తప్పని వాన కష్టాలు

Heavy Water Flow In Musi River

By -  Nellutla Kavitha |  Published on  27 July 2022 1:54 PM GMT
మూసీ నదికి వరద ఉద్దృతి - ఇంకా తప్పని వాన కష్టాలు

కుండపోత వర్షాలు, భారీ వరద ప్రవాహంతో ఎగువ ప్రాంతం నుంచి మూసీ నదికి భారీగా వరద వస్తోంది. హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో మూసీ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి పెరిగింది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, హుస్సేన్‌సాగర్‌ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి చేరుతోంది. హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో, నీరంతా మూసీ నదిలోకి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలను మూసీ నది ముంచేస్తోంది. దాంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.

హిమాయత్‌సాగర్ 8 గేట్ల ద్వారా మూసీలోకి అధికారులు 10700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ 13 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి మొత్తం పది వేల క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మూసారంబాగ్ వద్ద బ్రిడ్జిని ఆనుకుని మూసీ నది ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జితో పాటు మూసారంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు.

దీనికితోడు తెలంగాణలో వర్షాలు వరుసగా కురుస్తూనే ఉన్నాయి. సోమవారం నుంచి వర్షాలు రాష్ట్రాన్ని వదలడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతోపాటే మూసీ నది వరద ఉధృతికి శివారు ప్రాంతాలు, నదికి ఆనుకొని ఉన్న మూసి పరివాహక ప్రాంతాలు మునిగిపోతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఎగువ భాగం నుండి వస్తున్న వరదలతో తక్కువ ఎత్తులో ఉన్న మూసారాంబాగ్ బ్రిడ్జ్ మునిగిపోతోంది. దీంతో దిల్షుక్ నగర్, అంబర్పేట్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ మార్గాన వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు ఈ బ్రిడ్జి ప్రధాన రహదారి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో మూసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహించింది. ఈ నేపథ్యంలో బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని సమీక్షించారు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఇతర అధికారులు. ఈ బ్రిడ్జి పై ఫ్లైఓవర్ తరహాలో హై లెవెల్ బ్రిడ్జిని 52 కోట్లతో నిర్మించాలని, మరో రెండు నెలల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు ఎమ్మెల్యే వెంకటేష్.

వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తోడు, జంట జలాశయాల నుంచి విడుదలైన నీటితో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో మూసీ నదీపరిహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు, లోతట్టు కాలనీలు, బస్తీల వాసులు బిక్కుబిక్కుమంటుూ గడుపుతున్నారు. వరదలతో పాటే ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. వరద నీటి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Next Story