టాలీవుడ్ కంటెంట్ నే నమ్ముకోవడం శుభసూచికం !

By రాణి  Published on  19 Dec 2019 6:58 AM GMT
టాలీవుడ్ కంటెంట్ నే నమ్ముకోవడం శుభసూచికం !

హైదరాబాద్ : చూస్తుండగానే ఈ సంవత్సరం ఈ పూర్తవ్వబోతుంది. బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా పరిస్థితి ఈ ఏడాది బాగానే సాగింది. ఈ ఏడాది అనే కాదు, గత నాలుగైదు సంవత్సరాలలో వచ్చిన మన చిత్రాలను పరిశీలిస్తే టాలీవుడ్ తన దిశ మార్చుకుని మరో మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. కొత్తదనం లేని రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలను తీస్తే చూసే రోజులు పోయి.. వైవిధ్యమైన కంటెంట్ తో వచ్చే సినిమాలకు మన ప్రేక్షకులు అత్యధికంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఆ మధ్య వచ్చిన “కేరాఫ్ కంచరపాలెం”, “మజిలీ”, “జెర్సీ”, అలాగే ఇటీవలే వచ్చిన “బ్రోచేవారేవారురా”, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”, “ఓ బేబీ”, మల్లేశం వంటి కంటెంట్ సినిమాలు ఎన్నో విభిన్నమైన కథాంశాలతో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఒక విధంగా ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాలు ఒకప్పటి మన స్వర్ణయుగ చిత్రాలను గుర్తుకుతెస్తున్నాయి. స్వర్ణయుగం అంటే... మాయాబజార్, మిస్సమ్మ కాలంలో అద్భుతమైన సినిమాలు వచ్చేవి. కానీ ఆ తరువాత కాలానుగుణంగా మూవీ మేకర్స్ కూడా మారుతూ తెలుగు సినిమా అంటే...రొటీన్ యాక్షన్ స్టోరీలు, లాజిక్ లేని బిల్డప్ సీన్స్ లు, అర్ధం పర్ధం లేని పంచ్ డైలాగ్ లు అని ఫిక్స్ అయ్యేలా చేశారు మన దర్శకులు. అందుకు తగ్గట్లుగానే గడిచిన రెండు దశాబ్దాలలో అరకొరగా కొన్ని చిత్రాలు మినహాయించి..దాదాపు కమర్షియల్ సినిమాలే టాలీవుడ్ ను ఏలాయి.

అయితే అలాంటి కమర్షియల్ ఫార్మాట్ తో వచ్చిన సినిమాలను కూడా తిప్పి కొట్టిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయనుకోండి. అయినా ప్రేక్షకుల మీద డైరెక్టర్స్ వాటినే రుద్దే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే గడిచిన పదేళ్లలో వచ్చిన డైరెక్టర్స్ లో చాలామంది కంటెంట్ ను నమ్ముకునే సినిమాలు చేస్తుండటం శుభసూచికం. మొత్తానికి ఇన్నాళ్లకు టాలీవుడ్ కు కాలం కలిసివచ్చినట్లు అనిపిస్తోంది. బాహుబలి, సైరా, ఘాజీ, సాహో, రాబోతున్న ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో తెలుగు సినీపరిశ్రమకు జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానం లభిస్తుంది. తెలుగు సినిమాని అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేర్చుతూ విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకునేలా తెలుగు సినిమాను నిలబెడుతున్నందుకు మన టాలెంటెడ్ డైరెక్టర్స్ ను ప్రత్యేకంగా అభినందించి తీరాలి. ఇలాగే తెలుగు సినీ పరిశ్రమ కొనసాగుతుందని ఆశిద్దాం.

Next Story