ఒక అభ్యర్థికి ఇద్దరు భార్యలు ఉంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. కానీ ఇద్దరు మహిళలకు ఒకే భర్త ఉండి, ఆ ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తే….? చట్టం ప్రకారం ఆయన పోటీ చేయడానికి అనర్హుడే కానీ వారిద్దరూ అనర్హులు కారు. ఒక వేళ ఆ ఇద్దరూ ఎన్నికల్లో విజయం సాధిస్తే…? ఇంకేముందు సదరు భర్త గారికి డబుల్ ధమాకాయే.

తమిళనాట ఒక రైతు సరిగ్గా ఇదే పద్ధతితో ఇద్దరు సర్పంచ్ ల ముద్దుల మొగుడు అయ్యాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇద్దరూ వేర్వేరు చోట్ల నుంచి పోటీ చేశారు. ఇద్దరూ గెలిచారు. ఆ రైతు పేరు ధనశేఖరన్. తిరువణ్ణామలై జిల్లా వందవాసి పంచాయతీ పరిధిలో రెండు గ్రామాలున్నాయి. ఒకటి వళిపూర్ అగరం. అక్కడ నుంచి  ధనశేఖరన్ మొదటి భార్య సెల్వి పోటీ చేశారు. ఆమె గతంలోనూ సర్పంచ్ గా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ ఆమె విజయం సాధించారు.  రెండో భార్య కాంచన కోలిల్ కుప్పం సాతనూర్ పంచాయతీ నుంచి పోటీలోకి దిగారు. ఆమె కూడా విజయాన్ని సాధించారు.

ఇప్పుడు ఇద్దరు సర్పంచిల భర్త ధనశేఖరన్ వారిద్దరితో సగర్వంగా ఫోటో దిగి అందరితోనూ షేర్ చేసుకుంటున్నాడు. ఇక ఈ రెండు గ్రామాలూ నా ఇలాఖాయే అని బీరాలు పోతున్నాడట. ఈ డబుల్ దమాకా కొట్టిన అదృష్టవంతుడిని కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారట. “ఇద్దరు పెళ్లాలు వద్దురా శివుడా” అని ఇన్నాళ్లూ అనుకున్న వారంతా పెళ్లంటే చేసుకుంటే ధనశేఖరన్ లాగా చేసుకోవాలి. జాక్పాట్ కొట్టాలి అనుకుంటున్నారట.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.