ఎన్నికల వేళ టీటీడీ కీలక నిర్ణయం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  16 March 2024 6:13 AM GMT
ttd, vip break darshan, cancel,  lok sabha election,

ఎన్నికల వేళ టీటీడీ కీలక నిర్ణయం, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు 

తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. సర్వదర్శనం, ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం, వీఐపీ బ్రేక్‌ దర్శనం ఇలా పలు మార్గాల్లో వెంకన్నను దర్శనం చేసుకుంటారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు టీటీడీ బ్రేక్‌ వేసింది.

రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వారి పరివారంతో వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు. ఇంకొందరు సిఫార్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతి రోజు ఉదయం సమయంలో ఉంటుంటాయి. టీటీడీ అధికారులు భక్తుల రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్‌లు కేటాయిస్తారు. ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, కేంద్రమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేస్తుంటారు.

త్వరలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దాంతో.. టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రజాప్రతినిధులుకు ఇప్పటికే సమాచారం అందించింది టీటీడీ. సిఫార్సు లేఖలు అనుమతించనప్పటికీ ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే మాత్రం బ్రేక్ దర్శనం కల్పిస్తారు.

Next Story