మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
మే నెల కోసం శ్రీవారి ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీని టీటీడీ ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 1:21 AM GMTమే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజు భక్తులు పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో ప్రతి నెలా శ్రీవారి ప్రత్యేక దర్శనంతో పాటు వివిద ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తుంటుంది. తాజాగా మే నెల కోటా టికెట్ల విడుదల తేదీని టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించిన తేదీలను వెల్లడించింది. ఈ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందనీ.. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.
మే నెల కోటా టికెట్ల విడుదల తేదీలు:
ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్‌లో టికెట్ల మంజూరు ఉంటుంది. టికెట్లు లభించినవారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
ఇక ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవ వర్చువల్ సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నది టీటీడీ. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి స్లాట్లకు సంబంధించి కోటా విడుదల చేస్తుంది.
ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్టు టికెట్ల కోటా విడుదల చేస్తారు. అదే రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెట్లు విడుదల అవుతాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘరోగ పీడితులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది టీటీడీ.
ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలో వసతి గదుల కోటా టికెట్లు విడుదల అవుతాయి. ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా టికెట్లు, మధ్యాహ్నం 11 గంటలకు నవనీత సేవా టికెట్లు, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవా టికెట్లను టీటీడీ అధికారులు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు.