తిరుమల మెట్ల మార్గంలో టీటీడీ కొత్త ఆంక్షలు

టీటీడీ అధికారులు తిరుమల నడక మార్గంలో పలు ఆంక్షలు విధించారు.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2023 10:41 AM GMT
TTD, new restrictions, safety, Tirumala Steps,

తిరుమల మెట్ల మార్గంలో టీటీడీ కొత్త ఆంక్షలు

ఇటీవల తిరుమలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అంతేకాదు.. అంతకుముందు కూడా మెట్లమార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసింది. అయితే.. అప్పుడు తీవ్రగాయాలైన బాలుడు చికిత్స తర్వాత కోలుకున్నాడు. వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే టీటీడీ అధికారులు తిరుమల నడక మార్గంలో పలు ఆంక్షలు విధించారు.

తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత కోసం టీటీడీ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 సంవత్సరాల లోపు పిల్లలకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్‌ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ట్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్యాగ్‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్, పోలీసు టోల్‌ ఫ్రీ నంబర్‌ పొందుపరుస్తున్నారు. అలిపిరి–తిరుమల మార్గంలో ఇకపై వంద మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. భక్తులకు రక్షగా ముందు, వెనుక రోప్‌ను ఏర్పాటు చేశారు. రోప్‌ను సెక్యూరిటీ గార్డులు పట్టుకుంటున్నారు. ఈ రకంగా దర్శనానికి తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది.

సాయంత్రం 6 గంటల తర్వాత రెండో ఘాట్‌ రోడ్‌లో బైక్‌లను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అలిపిరి నుంచి గాలి గోపురం 7వ మెట్టు దగ్గర చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. చిరుత వరుస దాడులు చేస్తున్న క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో చిరుత తిరుగుతోందని.. ఆనవాళ్లను గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దాంతో.. అధికారులు చిరుతను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే చిరుతను గుర్తించి.. అడవిలో వదలిస్తామని చెబుతున్నారు.

Next Story