ధనవంతులకు కాదు..సామాన్యులకే మొదటి ప్రాధాన్యత: టీటీడీ నూతన చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2023 4:55 PM ISTధనవంతులకు కాదు..సామాన్యులకే మొదటి ప్రాధాన్యత: టీటీడీ నూతన చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గరుడాళ్వార్ సన్నిధిలో భూమనతో ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. అయితే.. అంతకుముందు భూమన తాతాయగుంట గంగమ్మ తల్లిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం అలిపిరి గోశాలలో ప్రత్యేక పూజలు చేసి.. ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అయితే.. ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో పాటు బోర్డు పదవీ కాలం ఆగస్టు 8వ తేదీతో ముగిసింది. అంతకు ముందే భూమన కారుణాకర్‌రెడ్డిని టీటీడీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. కాగా.. చైర్మన్ పదవి కోసం చాలా మంది వైసీపీ నాయకులు పోటీ పడ్డా.. చివరకు ఆ పదవి భూమనకు దక్కింది. వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో భూమన జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశారు. వామపక్ష భావజాలంతో ఆ తర్వాత భూమన ఆధ్యాత్మికత వైపునకు వెళ్లారు. గతంలోనూ 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా పని చేశారు భూమన కరుణాకర్‌రెడ్డి.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు చేరేలా స్వామివారి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తన మతం గురించి వస్తోన్న ఆరోపణలను పట్టించుకోనని అన్నారు భూమన. ధనవంతులకు టీటీడీ చైర్మన్‌గా ఊడిగం చేయబోనని స్పష్టం చేశారు. ధనవంతులకు ప్రాధాన్యత ఇవ్వడానికి తాను బాధ్యతలు తీసుకోలేదని అన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పారు భూమన.