జూన్ 22న తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడ్డ చిన్నారి ఇవాళ డిశ్చార్జ్ అయ్యాడు. 14 రోజుల చికిత్స తర్వాత పూర్తి ఆరోగ్యంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో చిన్నారిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారే బాలుడిని రక్షించారని అన్నారు.
'జూన్ 22న రాత్రి చిన్నారిపై చిరుత దాడి జరిగింది, టీటీడీ అధికారులు వెంటనే స్పందించి శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాలుడికి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అటవీశాఖ సహకారంతో చిరుతను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. నడకమార్గాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు'. అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు..
బాలుడి స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని. వెంకటేశ్వర స్వామి దయతోనే తమ కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. స్వామివారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చిరుత దాడి జరిగి కొద్ది నిమిషాల్లోనే టీటీడీ అధికారులు వేగంగా స్పందించి చికిత్స చేయించారని అన్నారు. అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు బాలుడి తల్లిదండ్రులు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించారని తెలిపారు.