తిరుపతిలో అన్యమత ప్రచారం

By రాణి  Published on  2 Jan 2020 1:53 PM GMT
తిరుపతిలో అన్యమత ప్రచారం

ముఖ్యాంశాలు

  • స్విమ్స్ చెట్లపై దర్శనమిచ్చిన అన్యమత చిహ్నాలు

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఉన్న చెట్లపై ఉన్నట్లుండి అన్యమత చిహ్నాలు దర్శనమిచ్చాయి. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆస్పత్రిలో ఉన్న చెట్లపై అన్యమత ప్రచారం జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన స్విమ్స్ సిబ్బంది చెట్లపై ఉన్న అన్యమత గుర్తులను చెక్కేశారు. స్విమ్స్ ఆస్పత్రి చీఫ్ సెక్యూరిటీ సూపర్ వైజర్ ఎలాంగో రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ..డిసెంబర్ 31వ తేదీ రాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నామన్నారు. జనవరి 1వ తేదీ ఈ విషయాన్ని ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని ఆదేశాలొచ్చాయి. దీంతో చెట్లపై ఉన్న చిహ్నాలను తొలగించినట్లు తెలిపారు. కాగా..ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరావు లేకపోవడం, న్యూ ఇయర్ సందర్భంగా ఆ రోజు సిబ్బంది తక్కువగా ఉండటంతో ఎవరూ చేశారన్నది తెలియడం లేదన్నారు ఎలాంగోరెడ్డి. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని ఆస్పత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.

ఇది ఈరోజే జరిగిందేమీ కాదు. కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలో అన్యమత ప్రచారం చేసేందుకు అరాచక శక్తులు భీష్మించుకున్నాయి. ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా టీడీపీ సభ్యులు అధికార పార్టీ తిరుపతిలో అన్యమత ప్రచారానికి తెరలేపుతున్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలను సంబంధిత శాఖ మంత్రి కొట్టిపారేశారు. అక్కడ అలాంటిదేమీ లేదని, అలాంటివేవైనా జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఇలా స్విమ్స్ చెట్లపై ఇతర మతానికి చెందిన గుర్తులు ప్రత్యక్షమవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story