రికార్డు స్థాయిలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం

By సుభాష్  Published on  5 Oct 2020 4:10 AM GMT
రికార్డు స్థాయిలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం

కరోనా ప్రభావంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదాయం భారీగా పడిపోయిన విషయం తెలిసింఏద. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని నెలలపాటు భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి. అనంతరం నిబంధనల ప్రకారం మళ్లీ ఆలయం తెరుచుకున్నతర్వాత భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. ఇక పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుండటంతో శ్రీవారి ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు కాస్త కుదుటపడుతోంది. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. ఆదివారం రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది.

ఆదివారం శ్రీవారిని 20,228 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.2.14 కోట్లు వచ్చింది. అలాగే 6,556 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. మరోవైపు ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి మాడవీధుల్లో వాహన సేవలు ఊరేగింపు జరగనుంది. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ఆలయాలపై తీవ్ర ప్రభావమే చూపింది. కరోనా ప్రభావంతో భక్తులు ఆలయాలను సందర్శించేందుకు వీలు లేకుండా పోయింది. ఆలయాలన్ని వెలవెలబోయాయి. అన్‌లాక్‌ ప్రక్రియల్లో భాగంగా సడలింపులు ఇవ్వడంతో కాస్త భక్తుల తాకిడి ఎక్కువైంది. తిరుమల వెంకన్న సన్నిధిలోని ఉద్యోగస్తులు సైతం కరోనా బారిన పడ్డారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా ఎన్నో ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అయినా కొందరు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో మరింత ఆందోళన వ్యక్తం అయింది. మళ్లీ భక్తుల దర్శనాలను నిలిపివేసినా.. తర్వాత మెల్లమెల్లగా అనుతించారు. తాజాగా తిరుమల శ్రీవారికి భక్తుల తాకిడి పెరిగిపోయింది. ఎప్పటిలాగే తమ మొక్కులు సమర్పించుకుంటూ వెంకన్నను దర్శించుకుంటున్నారు.

Next Story