నిజమెంత: తిరంగా వైరస్ టొమాటోలలో.. కరోనా కంటే ప్రమాదమా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 May 2020 12:55 AM GMT
నిజమెంత: తిరంగా వైరస్ టొమాటోలలో.. కరోనా కంటే ప్రమాదమా..?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత్ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంది. దేశంలో లక్ష పాజిటివ్ కేసుల మార్క్ ను భారత్ దాటేసింది.

ఇలాంటి సమయంలో మహారాష్ట్రలో టొమాటోలకు కొత్త వైరస్ సోకిందంటూ వార్తలు వస్తుండడంతో అందరినీ కలవరపెడుతోంది. ఆ వైరస్ కు తిరంగా వైరస్ అని పేరు పెట్టారు. మహారాష్ట్రలో మొత్తం 5000 ఎకరాలలో వేసిన టొమాటో పంటకు ఈ వైరస్ సోకిందని.. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమని టీవీ9 భరతవర్ష్ అనే హిందీ ఛానల్ రిపోర్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. కోవిద్-19 కంటే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమంటూ వీడియోలో పేర్కొన్నారు. మనుషులు టొమాటోలకు దూరంగా ఉండాలి అంటూ అందులో తెలిపారు.

టీవీ9 భరతవర్ష్ తన కథనాలలో ఈ వైరస్ కారణంగా టొమాటోలు నల్లగా మారుతూ ఉన్నాయని పేర్కొంది. దీంతో పలువురు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దయచేసి టొమాటోలకు కొద్దిరోజుల పాటూ దూరంగా ఉందామంటూ అందులో తమ సోషల్ మీడియా పోస్టులలో చెబుతూ ఉన్నారు.నిజమెంత:

వైరల్ అవుతున్న వార్త 'పచ్చి అబద్దం'.

మే 12న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతంలోని టొమాటో పంటకు ఓ వైరస్ అటాక్ అయ్యిందని పలు మీడియా సంస్థలు కథనాలను వెల్లడించాయి. జీ న్యూస్ ఇండియా కథనం ప్రకారం 'తాము వేసిన టొమాటో పంట ఆకులు త్వరగా ఎండిపోతూ ఉన్నాయని.. టొమాటోల ఆకారం, రంగు కూడా వేరేగా ఉందని, చాలా తొందరగా మాగిపోతూ ఉన్నాయని తెలిపారు.

theHinduBusineesLine.com కథనం ప్రకారం 2017లో పత్తి పంటకు బాల్ వార్మ్ రోగం ఎలాగైతే అటాక్ అయిందో ఇప్పుడు టొమాటో పంటకు అలాంటి పరిస్థితే వచ్చిందని తేలింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.

లాక్ డౌన్ కారణంగా రైతుల దగ్గరకు సైంటిస్టులు రాలేకపోయారు. అలాగే అగ్రికల్చరల్ యూనివర్సిటీలకు చెందిన వాళ్లు కూడా అక్కడికి పోలేకపోయారు. ఆ పంటలకు ఏమైందో తెలుసుకోడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

Siasat మీడియా సంస్థ కథనం ప్రకారం లోకల్ టీవీ ఛానల్స్, సోషల్ మీడియా కారణంగా స్థానికుల్లో భయాందోళనలు పెరుగుతూ ఉన్నాయని.. అదేదో తిరంగా వైరస్, రెడ్ వైరస్ వచ్చేసిందంటూ కథనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. టొమాటోలకు వచ్చిన రోగం కారణంగా మనుషులు తింటే ఏమైనా అవుతుందా అన్న విషయంలో ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ధారణ కాలేదు.

పంటకు సంబంధించిన శాంపుల్స్ ను పరీక్షల కోసం పంపారు.. రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కరోనా వైరస్ కంటే ప్రమాదకరం, వాటిని తింటే ప్రజలకు సోకుతుంది అనడానికి ఎటువంటి నిర్ధారణలు లేవు.

Agri News Network, ఇండియా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారి బిఎన్ఎస్ మూర్తీ మాట్లాడుతూ టీవీ9 భరతవర్ష్ తప్పుడు కథనాన్ని ప్రచురించిందని తెలిపారు. అంతేకాకుండా ఛానల్ కు బహిరంగ లేఖ రాశారు. మీ కథనాల్లో అవాస్తవం ఉందని.. టొమాటో పంటకు ఏదో వ్యాధి సోకడం నిజమేనని.. అంతేకాని తిరంగా వైరస్ సోకింది.. ఆ టొమాటోలను తింటే ప్రజలు చనిపోతారు అంటూ అసత్య కథనాలను తెలియజేయడం ద్వారా ప్రజలను భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటి వరకూ చెట్టుకు వచ్చిన వైరస్ కారణంగా.. వాటిని తిన్న మనుషులకు వైరస్ సోకడం అన్నది జరగలేదని.. ఏదైనా సమాచారం ఇచ్చే ముందు సరిగా రిపోర్టింగ్ చేశాక వెల్లడించాలని ఆయన అన్నారు.

టీవీ9 భరతవర్ష్ కూడా తమ కథనాలలో తప్పు ఉందని అన్నారు. సోషల్ మీడియా లోని వార్తలను చూసి తాము తిరంగా వైరస్ అంటూ కథనాలను వెల్లడించామని, తప్పు చేశామని తెలిపింది.

టొమాటోలను తింటే కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైన వైరస్ వస్తుందంటూ వచ్చిన వార్తలు "పచ్చి అబద్ధం"

Claim Review:నిజమెంత: తిరంగా వైరస్ టొమాటోలలో.. కరోనా కంటే ప్రమాదమా..?
Claim Fact Check:false
Next Story