నేను నా లాగే ఉంటాను : శ్రీముఖి
By రాణి Published on 31 Jan 2020 2:03 PM ISTశ్రీముఖి అంటే బబ్లీ గర్ల్. శ్రీముఖి అంటే ఫన్. శ్రీముఖి అంటే గ్లామర్... శ్రీముఖి అంటే లైవ్లీ అండ్ లవ్లీ. బిగ్ బాసిణి అయిన తరువాత నుంచి ఆమె లెవలే వేరైపోయింది. ఆమె గ్లామర్ కోషెంట్ అమాంతంగా పెరిగిపోయింది. పాపులారిటీ పారామీటర్ పాదరసం అయిపోయింది. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ స్మాల్ స్క్రీన్ గర్ల్ గా ఎన్నికైన తరువాత ఆమె పాపులారిటీ నిచ్చెన వైకుంఠపాళి వందో గడికి చేరుకుంది. ఇంకా స్పెషల్ ఏమిటంటే అమ్మడు ఇప్పుడు బరువు బాగా తగ్గింది. ఎప్పుడూ గెలుపు గుర్రం పైనే ఉండాలనుకునే ఈ ఫాస్ట్ గర్ల్ కి ఇప్పుడు బరువు తగ్గడం మరో ప్లస్సయిపోయింది.
గతేడాది మోస్ట్ డిజైరబుల్ గర్ల్స్ లిస్టులో ఆమెది పదకొండో ప్లేసు. ఇప్పుడామె టాప్ మోస్ట్. ఇదంతా బిగ్ బాస్ వల్లే సాధ్యమైందని ఆమె దృఢనమ్మకం. బిగ్ బాస్ లో రియల్ శ్రీముఖి ని అందరూ చూడగలిగారు. ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగారు. అందుకే తనకు ఇన్ని వోట్లు వచ్చాయని ఆమె భావిస్తుంది. సోషల్ మీడియాలో అక్క నుంచి సెక్సీగా ఎదగడం కూడా ఒక విచిత్రమే. తనకు మినీ స్కర్టు ఇచ్చినా హోమ్లీగానే ఉండగలనని శ్రీముఖి నమ్మకం. తనను వెస్టర్న్ డ్రస్సుల్లో చూసి చాలా మంది ఇష్టపడతారని, అయితే ట్రెడిషనల్ లుక్స్ ఇంకా అలరిస్తాయని ఆమె అంటోంది. తనకు విద్యాబాలన్, సౌందర్య, సావిత్రిలే ఇన్ స్పిరేషన్ అంటుంది శ్రీముఖి. మీరు చేసే పనిని బట్టి గుర్తింపు వస్తుందే తప్ప డ్రస్ వల్ల, ఫ్యాషన్ వల్ల కాదని ఆమె అంటుంది. హాట్ నెస్ నిర్వచనం మారుతోందని, గతంలో లాగా ఒక లుక్ ఉంటేనే హాట్ అన్న అభిప్రాయం ఇప్పుడు లేదని, ఒక వ్యక్తి ఇతరుల్లా కాక తనలా ఉంటేనే హాట్ నెస్ పెరుగుతుందని ఆమె అంటోంది.
ఇక తనకి కాబోయే వాడు ఎలా ఉండాలన్న ప్రశ్న వేస్తే , రణవీర్ సింగ్ లో ఇరవై శాతం ఉన్నా చాలని ఆమె చిలిపి సమాధానం ఇచ్చింది. హృతిక్ రోషన్ లాంటి బాడీ లేకున్నా ఫరవాలేదు కానీ రణవీర్ లాంటి సెన్సాఫ్ హ్యూమర్ , కామిక్ టైమింగ్ ఉండాలని ఆమె అంటోంది. తాను పెద్దగా ఫిట్ నెస్ ఫ్రీక్ ను కాదని, ఏదో ఖాతే పీతే టైప్ గా ఉండాలనుకునే వ్యక్తినేనని, అయితే ఇటీవలే సైజ్ జీరో ను సాధించాలన్న కోరిక కలిగిందని, అందుకే ఆ దిశగా ప్రయత్నించానని ఆమె చెబుతోంది. మొత్తానికి ఫ్యాషన్ పరమపద సోపాన పటంలో పదకొండు నుంచి ఒకటో స్థానానికి ఎగబాకిన శ్రీముఖి రాఠోడ్ కి బెస్టాఫ్ లక్.
https://telugu.newsmeter.in/times-of-india-most-disirable-girls/