మీ భద్రతకు మేం గ్యారంటీ ఇస్తున్నాం: టిక్‌టాక్ సీఈవో
By సుభాష్ Published on 1 July 2020 3:05 PM ISTభారత్‌లో టిక్‌టాక్ ఉద్యోగుల భద్రతకు పూర్తిస్థాయిలో హామీ ఇస్తున్నామని టిక్‌టాక్ సీఈవో కెవిన్ మేయర్ అన్నారు. తమ లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో ఎంతో కృతకృత్యులమయ్యామని చెప్పుకొచ్చారు. భారతీయ చట్టాల కింద డేటా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి అంశాలకు తామెంతో ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఈ మేరకు ఇండియాలోని టిక్‌టాక్ సిబ్బందికి ఆయన ఓ లేఖ రాశారు. చైనాలోని బైట్ డాన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అయిన కెవిన్ మేయర్ ఇటీవలే ఈ బాధ్యతలు స్వీకరించారు. తమ కంపెనీ వెబ్‌సైట్‌పై ఈ లేఖను పోస్టు చేశారు. 2018 నుంచి ఇండియాలో కోట్లాది యూజర్లు ఈ యాప్ ద్వారా వినోదాన్ని పొందేందుకు , తమ అనుభవాలను ఇతరులతో షేర్ చేసుకునేందుకు తాము కృషి చేస్తూనే ఉన్నామని అన్నారు. మా ఉద్యోగులే మాకు బలం, మీ క్షేమమే మేం కోరుతున్నాం అని చెప్పుకొచ్చారు.
భారత్‌లోని తమ సంస్థ ఉద్యోగుల భద్రతపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. డిజిటల్ ఇండియాలో మేం క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నామని, తాజా పరిణామాలపై భాగస్వాములతోనూ, వాటాదారులతోనూ చర్చలు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 'ఇండియాలోని మా సిబ్బందికి ఓ సందేశం' అంటూ ఈ లేఖ రాశారు.
కాగా, భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు సంబంధించిన 59 యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.