ఆదిలాబాద్‌ జిల్లాలో మళ్లీ పులి కలకలం సృష్టించింది. భీంపూర్‌ మండలం తాంసీ శివారులో.. మరో ఆవును పులి చంపడంతో పరిసర గ్రామ ప్రజలు తీవ్రభయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదురోజుల క్రితం కూడా గొల్లఘాట్‌ శివారులో ఓ ఆవుని పులి బలిగొంది. తాంసి గ్రామం మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంగా ఉంటుంది. ఇక్కడి అటవీ ప్రాంతం విశాలమైనది. తరచుగా పులులు మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్ నుంచి భీంపూర్ సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నాయి.

సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడకు చేరుకుని పులి దాడిలోనే ఆవు మృతి చెందినట్లు నిర్దారించారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ప్రజలు పొలాల వైపు వెళ్లొద్దని సూచించారు. కాగా గతేడాది డిసెంబర్లో తాంసి శివారులో చిరుత పులి కళేబరం సంచలనం రేపింది. దీన్ని స్థానికులు చంపారా? లేదా ఎవరైనా వేటగాళ్లు చంపారా అన్న విషయం ఇంకా తేలలేదు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.