పుల్వామాలో భారీ ఎన్‌ కౌంటర్‌.. హిజ్జుల్‌ ముజహిద్దీన్‌ టాప్‌ కమాండర్‌ హతం

జమ్మూకశ్మీర్‌లో భారీ  ఎన్‌ కౌంటర్‌ చోటు చేసుకుంది. పుల్వామా ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో హిజ్జుల్‌ ముజహిద్దీన్‌ టాప్‌ కమాండర్‌ హమద్‌ ఖాన్‌ సహా మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం భద్రతా బలగాలు గుల్షన్‌ పురాలో గాలింపు చర్యలు చేపడుతుండగా, ఓ నివాస గృహంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆ గృహాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై ఇంటి లోపలి నుంచే కాల్పులకు దిగగా, అందుకు భద్రతా బలగాలు వారి కాల్పులను తిప్పికొట్టారు.

ఈ కాల్పుల్లో హమద్‌ ఖాన్‌ తో పాటు ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఘటన స్థలంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కాగా, అనంత్‌ నాగ్‌లోముగ్గురు హిజ్జుల్‌ ఉగ్రవాదులను శనివారం భద్రతా బలగాలు అరెస్టు చేసిన మరుసటి రోజే భారీ ఎన్‌ కౌంటర్‌ చోటు చేసుకోవడం గమనార్హం.

దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చనే ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారంతో భారత భద్రత దళాలు అప్రమత్తంగా ఉంటున్నారు. పుల్వామా ప్రాంతంలో భారత బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇటీవల భారత్‌ లోకి దాడులకు పాల్పడేందుకు పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చొరబడుతున్నారని సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎన్నిసార్లు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినా..భారత బలగాలు వారి కాల్పులను తిప్పుకొడుతూనే ఉన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.