చెన్నై: ప్రధాన మంత్రి మోడీ కి బహిరంగ లేఖ రాసి దేశద్రోహం కేసులు ఎదుర్కొంటున్న 49 మందికి కమల్ హాసన్ తన మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. దేశంలో మూక దాడులు పెరుగుతున్నాయని వాపోయారు. జైశ్రీరామ్ నినాదం దుర్వినియోగం అవుతోందన్నారు. లేఖ రాసినంత మాత్రాన దేశద్రోహం కేసు నమోదు చేయడం సరికాదని కమల్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి దేశం సామరస్యంగా ఉండాలని కోరుకుంటున్నారని కాని.. దాన్ని అనుసరించడం లేదన్నారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగాలకు ఇప్పుడు జరుగుతున్న దానికి పొంతన కుదరటం లేదన్నారు కమల్. న్యాయాన్ని నిలబెట్టే దిశగా కోర్టు వ్యవహరించాలని, బిహార్‌లో నమోదైన ఈ కేసును రద్దు చేయాలని కమల్ ట్వీట్ చేశారు.

మూక దాడులకు పాల్పడటం, దాడుల సందర్భంగా జైశ్రీరామ్ నినాదాన్ని ఉపయోగించడం అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 49 మంది ప్రముఖులు ఈ ఏడాది జులై లో ప్రధానికి లేఖ రాశారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ, సినీ ప్రముఖులు మణిరత్నం, రేవతి, అపర్ణాసేన్ తదితరులు లేఖ రాసిన వారిలో ఉన్నారు. అప్పట్లో ఈ లేఖ వివాదాస్పదమైంది. అయితే వీరందరూ సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారంటూ బిహార్‌ న్యాయవాది సుధీర్ ఓజా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన మేజిస్ట్రేటు ఈ లేఖలో సంతకాలు చేసిన వారందరిపై FIR నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్