టాలెంటెడ్ హీరో కొత్త సినిమా.. తిమ్మ‌రు‌సు

By సుభాష్  Published on  8 Sep 2020 6:11 AM GMT
టాలెంటెడ్ హీరో కొత్త సినిమా.. తిమ్మ‌రు‌సు

హీరోగా బాక్సాఫీస్ స‌క్సెస్ అందుకోక‌పోయినా.. ఓటీటీ హిట్ అందుకున్నాడు టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్య‌దేవ్. నెల కింద‌టే అత‌డి సినిమా ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై మంచి స్పంద‌న రాబ‌ట్టుకుంది. ఆ ఉత్సాహంలో స‌త్య‌దేవ్ వ‌రుస‌గా సినిమాలు అనౌన్స్ చేస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టికే స‌త్య‌దేవ్, త‌మ‌న్నా జంట‌గా గుర్తుందా శీతాకాలం అనే సినిమాను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌త్య‌దేవ్ మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. తిమ్మరుసు కావ‌డం విశేషం. అసైన్మెంట్ వాలి అనేది క్యాప్ష‌న్. టైటిల్, క్యాప్ష‌న్‌ను బ‌ట్టి చూస్తే ఇదో థ్రిల్ల‌ర్ మూవీలా క‌నిపిస్తోంది. క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టిన న్యాయ‌దేవ‌త చిత్రంతో టైటిల్ పోస్ట‌ర్ ఆస‌క్తిక‌రంగానే తీర్చిదిద్దారు.

ఇంత‌కుముందు నిఖిల్ హీరోగా కిరాక్ పార్టీ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శ‌ర‌ణ్ కొప్పిశెట్టి తిమ్మరు‌సు చిత్రాన్ని రూపొందించనున్నాడు. శ‌ర‌ణ్ తొలి చిత్రం క‌న్న‌డ మూవీకి రీమేక్. అది చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. ఇప్పుడు సొంత క‌థ‌తో స‌త్య‌దేవ్ లాంటి టాలెంటెడ్ న‌టుణ్ని పెట్టి సినిమా తీసి త‌నేంటో రుజువు చేసుకోవాల‌ని చూస్తున్నాడు. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌ల పీఆర్వోగా ఉండి.. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారి నా నువ్వే, 118, మిస్ ఇండియా చిత్రాల్ని నిర్మించిన మ‌హేష్ కోనేరు ప్రొడ‌క్ష‌న్లో తిమ్మ‌ర‌సు తెర‌కెక్క‌నుంది. హీరోగా ఆశించిన విజయాలందుకోలేదు కానీ.. సత్యదేవ్ టాలెంట్ ఏంటో ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఈ మ‌ధ్య కొంచెం కాలం క‌లిసొచ్చి కెరీర్ గాడిన ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం హీరోగా న‌టిస్తున్న రెండు చిత్రాల‌తో అత‌డి కెరీర్ కొత్త మ‌లుపు తిరుగుతుందేమో చూడాలి.

Next Story