నటుడు జయప్రకాశ్‌రెడ్డి సినీరంగ ప్రస్థానం

By సుభాష్  Published on  8 Sep 2020 5:29 AM GMT
నటుడు జయప్రకాశ్‌రెడ్డి సినీరంగ ప్రస్థానం

తెలుగు సినిమాల్లో విలక్షణ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన జయప్రకాశ్‌ రెడ్డి(74) ఈ రోజు కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోని కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లను నిలిచిపోవడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.

జయప్రకాశ్‌ రెడ్డి 1946 మే 8వ తేదీన జన్మించారు. సొంతూరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం శిరివెళ్ల. రాయలసీమ యాసలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాశ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. కుర్ర హీరోలతో పాటు సీనియర్‌ హీరోలందరితో కలిసి పని చేసిన అనుభవం జయప్రకాశ్‌ది. 32 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యక స్థానాన్ని సంపాదించుకున్నారు. జయప్రకాశ్‌ రెడ్డి నటించిన చివరి సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. జయప్రకాశ్‌ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి సాంబిరెడ్డి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేటలోని ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. పదో తరగతిలో ఉండగా తండ్రికి అనంతపురం బదిలీ కావడంతో అక్కడ సాయిబాబా నేషనల్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పదో తరగతి చదివాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఎంతో ఆసక్తి. పాఠశాల దశలోనే చిన్నచిన్న నటకాల్లో నటించారు.

తండ్రి సపోర్టుతోనే..

జయప్రకాశ్‌రెడ్డి తండ్రి కూడా నటుడే కావడంతో మంచి సపోర్టు దొరికింది. తండ్రీకొడుకులు కలిసి చాలా నాటకాల్లో నటించారు. నాటకాల్లోనే కాకుండా చదువులోనూ చురుకుగా ఉండే జయప్రకాశ్‌.. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. అయితే అతను చదువుకునే సమయంలో 'దుర్యోధన గర్వభంగం' అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టి పట్టేసి అప్పజెప్పేవాడు. చిన్నతనంలో జయప్రకాశ్‌ నటను వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

1988లో బ్రహ్మపుత్రుడు చిత్రంతో వెండితెరపై ఎంట్రీ

కాగా, 1988 లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు జయప్రకాశ్‌రెడ్డి. రాయలసీమ యాసలో విలనిజం చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. పలు నాటకాల్లో ఆయన నటించారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, బిందాస్‌, ఛత్రపతి, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్‌షా, రేసు గుర్రం, సరైనోడు, పటాస్‌, మనం, రెడీ, ఖైదీనంబర్‌ 150, జై సింహా, రాజా ది గ్రేట్‌ వంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా మహేష్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో కనిపించారు.

కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటనతో ప్రేక్షకులకు వినోదం పంచారు. తన రాయలసీమ యాస, యాష భాషతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఎన్నో రకాల పాత్రలు పోషించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా జయప్రకాశ్‌ రెడ్డి విలన్‌గా కాకుండా ఎన్నో పాత్రల్లో నటించారు. శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన ఢీ, రెడీ, ఇవివి ఎవడిగోల వాడిదిలలో మంచి కమెడియన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ప్రతినాయకుడిగా పాత్రలో నటించి, హస్యనటుడిగా అలరించి ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. యువ నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత వయసు మీద పడినా కుర్ర హీరోలకు ధీటుగా ఆయన నటన సాగించారు. బాలకృష్ణతో కలిసి ప్రతినాయకుని పాత్రలో జయప్రకాశ్‌ చేసే నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంత గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాశ్‌ రెడ్డి సినీ పరిశ్రమతో పాటు అభిమానుల జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ మంచి నటుడిని కోల్పోయామని ప్రముఖ సినీ నటుడు, దర్శకులు, నిర్మాతలు, తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story