అక్కడ బుధవారం ఒక్క కేసు నమోదుకాలే!

By Newsmeter.Network  Published on  19 March 2020 6:37 AM GMT
అక్కడ బుధవారం ఒక్క కేసు నమోదుకాలే!

కరోనా వైరస్‌ తీవ్రత నుండి చైనా కోలుకుంటుందా.. ఆ దేశంలో పరిస్థితి నార్మల్‌ స్థితికి రానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మూడు నెలలుగా చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ ఇప్పుడిప్పుడే కదుటపడుతున్నట్లు కనిపిస్తుంది. బుధవారం స్థానికంగా ఒక్క కరోనా పాజిటివ్‌ కేసుకూడా నమోదు కాలేదంట. ఈ విషయాన్ని స్వయంగా చైనా ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చైనాలో అంతర్గతంగా బుధవారం కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, విదేశాల నుంచి వచ్చిన వారిలో 34కేసులు కొత్తవి నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వాటిలో 21బీజింగ్‌లో, మరో రెండు షాంఘై, 9 కేసులు గ్వాంగ్‌ డాంగ్‌ ప్రావిన్సుల్లో నమోదయినట్లు ఎన్‌హెచ్‌సీ అధికారులు తెలిపారు.

Also Read :ఏయ్ కేఏ పాల్.. ఈ సుత్తిసలహాలు ఇచ్చేబదులు.

ఇదిలా ఉంటే ఇప్పటికే వైరస్‌ సోకిన వారిలో బుధవారం చైనాలో మరో ఎనిమిది మంది మృతి చెందగా.. అనుమానిత కేసులు 23 నమోదైనట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చైనాలో ఇప్పటి వరకు మొత్తం నిర్దారణ అయిన కేసులు సంఖ్య 80,920కి చేరింది. మొత్తం 3,245 మంది మృతి చెందారని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రస్తుతం చైనా వెల్లడించిన గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం 34 కరోనా వైరస్‌ కేసులు నమోదైనా వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు ప్రకటించారు.

చైనా కాదు, ఏ దేశానికైనా వైరస్‌ను పూర్తిగా నిరోధించడం సాధ్యంకాదు. చైనాలో అనేక ప్రావిన్సులు, నగరాల్లో ప్రయాణాలు నిలిపివేశారు. ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసిన తర్వాత వైరస్‌ మళ్లీ వ్యాపిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ చైనా చెప్పింది నిజమైతే.. ఇటలీ, అమెరికా లాంటి దేశాలు ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని సతమతమవుతుంటే, చైనా మాత్రం వైరస్‌ను సమర్థంగా నిరోధించి, లక్ష్య సాధనలో విజయం నమోదు చేసినట్లే చెప్పవచ్చు.

Next Story